భీంగల్ రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న భీంగల్–బడా భీంగల్ ప్రధాన రహదారికి మరమ్మతు పనులను సోమవారం ప్రారంభించారు. ఈ రహదారి దెబ్బతినడంతో బడా భీంగల్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రహదారి మరమ్మతుల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయించారు. మంజూరైన నిధులతో బ్రిడ్జి వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఈ రహదారి అత్యంత కీలకమైందని, పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి, బోదిరే స్వామి, వైస్ చైర్పర్సన్ జేజే లత, జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, 1వ వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ, నాగేంద్రబాబు, 2వ వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అనంతరావు, 11వ వార్డు కౌన్సిలర్ సంగ్యా నాయక్, బింగివారి రాము, శ్రీకాంత్, నవీన్, కిరణ్, సురేష్, ఎల్లయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
