అల్లూరి నేటి తరానికి స్ఫూర్తి: ఎమ్మెల్యే బడేటి చంటి
ఏఎస్ఆర్ స్టేడియంలో ఘనంగా అల్లూరి 129వ జయంతోత్సవం
ఏలూరు, ఆంధ్రప్రభ: భారత స్వాతంత్ర్య సంగ్రామానికి విప్లవ బాటలు పరచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన వారి సేవలు రానున్న తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియం వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతోత్సవాన్ని ఏఎస్ఆర్ స్టేడియం మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం విగ్రహ ఏర్పాటు కోసం తొలి నుంచి కృషి చేసిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జల్లా వీరభద్రరావును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఇదే సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే బడేటి చంటిని సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఒక స్ఫూర్తి అని, స్వాతంత్ర్య సమరోత్సాహానికి విప్లవ బాటలు పరచిన మహనీయుడని కొనియాడారు. ప్రజల గుండెల్లో అల్లూరి చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. చారిత్రాత్మక ప్రదేశమైన ఏఎస్ఆర్ స్టేడియం వద్ద అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు.
స్టేడియం వద్ద మెస్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ అంశంలో అవసరమైన సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, రెడ్‌క్రాస్ బోర్డు సభ్యుడు బాలయోగి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
