సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్నపాటి లోపానికీ తావివ్వొద్దు.. అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఓబులవారిపల్లె మండలంలోని ముక్కవారిపల్లి పంచాయతీ వద్ద జూలై 2న నిర్వహించనున్న వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రాంజీ) పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి చిన్నపాటి లోపానికీ తావివ్వొద్దని స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం ముక్కవారిపల్లిలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాలను ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ రూపానంద రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
జూలై 2న జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి సుమారు 15 వేల నుంచి 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అనుగుణంగా సీటింగ్, పార్కింగ్, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా సభా ప్రాంగణంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ రూపానంద రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ బృందంతో కలిసి ఏర్పాట్లను సమీక్షించినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
ఈ పరిశీలనలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఏఎస్పీ కులశేఖర్, తిరుపతి ఏఎస్పీ శ్రీనివాస్, తిరుపతి ఆర్డీవో రాం మోహన్, డ్వామా పీడీ మద్దిలేటి, డీపీవో సుశీలాదేవి, డీఆర్డీఏ పీడీ శోభన్‌బాబు, పంచాయతీరాజ్ ఎస్ఈ మధుసూదన్, ఆర్ అండ్ బీ ఎస్ఈ రాజానాయక్, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
