బిగ్‌బాస్-10లో వినోదానికి కొత్త నిర్వచనం..
- కామనర్స్‌కు మరోసారి ఛాన్స్.. అగ్నిపరీక్షతో మొదలైన పోటీ
- అక్కినేని నాగార్జునే మళ్లీ హోస్ట్?
- రియాల్టీకి మరింత చేరువగా పదో సీజన్
- అగ్నిపరీక్షతో కామనర్స్ ఎంపిక.. కొత్త టాస్కులతో మరిన్ని ట్విస్టులు
- మరో రెండున్నర నెలల్లో ప్రేక్షకుల ముందుకు.. తేదీపై ఇంకా సస్పెన్స్
ఆంధ్రప్రభ వెబ్, వినోదం : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తొమ్మిది సీజన్ల తర్వాత ఇప్పుడు అందరి చూపు బిగ్‌బాస్ తెలుగు సీజన్-10పై నిలిచింది. మైలురాయి సీజన్ కావడంతో ఈసారి షోను మరింత భారీ స్థాయిలో, మరింత ఉత్కంఠ భరితంగా రూపొందించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వినోదం, వ్యూహాలు, భావోద్వేగాలు, పోటీ తత్వం… ఇవన్నింటినీ మరో మెట్టెక్కించేలా పదో సీజన్ ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అగ్నిపరీక్షతో మొదలైన అసలు పోటీ
హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం కోసం వేలాది మంది ఎదురుచూస్తుండగా, గత సీజన్‌లో పరిచయం చేసిన ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్‌ను ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. సెలబ్రిటీలతో పాటు ప్రతిభ ఉన్న కామనర్స్‌కు కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినా, మరింత మందికి అవకాశం కల్పిస్తూ ప్రత్యేక కాంటెస్ట్‌ను నిర్వహించడం విశేషం.
దీని ప్రకారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలని భావించే వారు తమ ప్రతిభను చాటే వీడియోను పంపించాలి. ఎంపికైన వారికి అగ్నిపరీక్షలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి కామనర్స్ నుంచి భారీ స్పందన వచ్చినట్లు సమాచారం.
కామనర్స్‌పై ప్రత్యేక దృష్టి
ఈసారి కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా, సాధారణ జీవితంలో అసాధారణ ప్రతిభ కనబరిచే వ్యక్తులను కూడా హౌస్‌లోకి తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియా క్రియేటర్లు, ఉద్యోగులు, విద్యార్థులు, క్రీడాకారులు, మోడల్స్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన యువత పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తున్నారు.
మదనపల్లె యువతిపై సోషల్ మీడియాలో చర్చ
అగ్నిపరీక్ష కోసం దరఖాస్తు చేసిన వారిలో చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఎం. విశిష్ట పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె సమర్పించిన ఆడిషన్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. గతంలో అందాల పోటీల్లో ‘మిస్ బ్యూటిఫుల్’ టైటిల్‌ను గెలుచుకున్న విశిష్ట మోడలింగ్ రంగంలో కూడా చురుకుగా కొనసాగుతోంది. ఆమె నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు ఆమె ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
హోస్ట్‌గా నాగార్జునేనా?
గత కొన్ని సీజన్లుగా తనదైన శైలిలో షోను విజయవంతంగా నడిపించిన అక్కినేని నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున వ్యాఖ్యానం, వీకెండ్ ఎపిసోడ్‌లు బిగ్‌బాస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో అభిమానులు కూడా ఆయన కొనసాగింపునే కోరుకుంటున్నారు.
పదో సీజన్‌లో కొత్త ట్విస్టులు?
మైలురాయి సీజన్ కావడంతో హౌస్ డిజైన్, టాస్కులు, ఎలిమినేషన్ విధానం, గేమ్ రూల్స్‌లో పలు మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో లేని కొత్త టాస్కులు, అనూహ్య ట్విస్టులు, ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని పెంచే అంశాలను కూడా ప్రవేశపెట్టే అవకాశముందని టీవీ వర్గాలు చెబుతున్నాయి.
కంటెస్టెంట్లపై ఉత్కంఠ
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కామనర్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక్క కంటెస్టెంట్ పేరును కూడా నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఫైనల్ లిస్టులో ఎవరుంటారన్న దానిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
ఎప్పుడు ప్రారంభం?
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 ప్రారంభ తేదీని నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. అయితే గత సీజన్ల తరహాలోనే మరో రెండున్నర నెలల్లో షో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ప్రోమోలు, హోస్ట్, కంటెస్టెంట్ల జాబితా, ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
100 రోజుల అసలు సంగ్రామం.. ఈసారి ఎవరిది పైచేయి?
ఒకే ఇంట్లో వంద రోజుల పాటు విభిన్న మనస్తత్వాలు, వ్యూహాలు, భావోద్వేగాలు, గొడవలు, స్నేహాలు, టాస్కులు… వీటన్నింటి మధ్య చివరి వరకు నిలబడేది ఎవరు? ప్రేక్షకుల మనసు గెలిచి ట్రోఫీని సొంతం చేసుకునేది ఎవరు? అన్న ఆసక్తి ఇప్పటినుంచే మొదలైంది. పదో సీజన్ కావడంతో ఈసారి బిగ్‌బాస్ మరింత రసవత్తరంగా సాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
