cm chandrababu | ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
cm chandrababu | ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
పాడి పంటలతో రైతుల ఇళ్లలో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్ష
వ్యవసాయ రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి
cm chandrababu | అమరావతి, ఆంధ్రప్రభ : ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ రైతుల జీవితాల్లో ఆనందం, సిరిసంపదలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున రైతులు భూమిని, పశుసంపదను పూజిస్తూ ప్రకృతితో అనుబంధాన్ని చాటుకునే సంప్రదాయమే ఏరువాక అని సీఎం పేర్కొన్నారు. పాడి పంటలతో రైతుల ఇళ్లు కళకళలాడాలని, వ్యవసాయంలో సమృద్ధి నెలకొనాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మనదని పేర్కొన్న చంద్రబాబు.. ఆ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ సాగు చేస్తే భూమి సారవంతంగా ఉండటంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా పరిరక్షించబడుతుందని అభిప్రాయపడ్డారు. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ ప్రకృతి సాగు వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద నిధులు జమ చేసి అండగా నిలిచామని తెలిపారు.
ఎల్నినో ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి ఎదురయ్యే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రభుత్వ సూచనలు, వ్యవసాయ శాఖ సలహాలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని, రైతుల జీవితాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
