తుదిదశకు ఏపీఎల్ పోటీలు

నేటి నుండి ప్లే ఆఫ్స్ మహాసంగ్రామం…
డబుల్ ధమాకాతో ఫైనల్ కు జట్లు…
నేటి నుంచే అసలైన పోరు
ఎలిమినేటర్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్–విజయవాడ సన్ షైనర్స్ అమీతుమీ
క్వాలిఫయర్-1లో అగ్రస్థాన జట్ల అమరావతి రాయల్స్–భీమవరం బుల్స్ తలపడి
క్వాలిఫయర్-1 విజేతకు నేరుగా ఫైనల్ బెర్త్…
ఓడిన జట్టుకు మరో అవకాశం
జూన్ 30న ఏపీఎల్ ఫైనల్

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 లీగ్ దశ ముగియడంతో అసలైన నాకౌట్ సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ మ్యాచ్‌ల అనంతరం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అభిమానులకు నేడు డబుల్ ధమాకాగా ఎలిమినేటర్, క్వాలిఫయర్-1 మ్యాచ్‌లు జరగనున్నాయి.

అగ్రస్థానం లో అమరావతి…

లీగ్ దశ ముగిసే సరికి క్యాపిటల్ అమరావతి రాయల్స్ అగ్రస్థానంలో నిలవగా, భీమవరం బుల్స్ రెండో స్థానంలో, సింహాద్రి వైజాగ్ లయన్స్ మూడో స్థానంలో, విజయవాడ సన్ షైనర్స్ నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా, విజేత క్వాలిఫయర్-2కు చేరుకుంటుంది. అనంతరం రాత్రి 7 గంటలకు జరిగే క్వాలిఫయర్-1లో అగ్రస్థాన జట్లు క్యాపిటల్ అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఈ నెల 30న జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉండగా, ఎలిమినేటర్ విజేతతో రేపు జరిగే క్వాలిఫయర్-2లో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో క్వాలిఫయర్-1 విజేతను ఢీకొంటుంది. దీంతో ఏపీఎల్-2026 టైటిల్ కోసం ఇక ప్రతి మ్యాచ్ నాకౌట్ సమరంగా మారనుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా జరిగే ఈ కీలక మ్యాచ్‌ల కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.