పోలియో రహిత సమాజం కోసం అందరూ సహకరించాలి
మక్తల్, ఆంధ్రప్రభ: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హన్మంతు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సిద్దప్పతో కలిసి ఆమె చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించి, ఈ మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రెండు పోలియో చుక్కలు నిండు జీవితానికి రక్షణ ఇస్తాయని, ఇవే చిన్నారులకు అంగవైకల్యం కలగకుండా కాపాడుతాయని పేర్కొన్నారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు బాధ్యతగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా చుక్కల మందు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కట్టా సురేష్ కుమార్ గుప్తా, కర్ని పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ తిరుపతి, వైద్య సిబ్బంది శ్రీధర్, యాదగిరి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
