పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
0–5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి
నర్సాపురం, ఆంధ్రప్రభ: జాతీయ టీకాకరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సాపురం మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి పిలుపునిచ్చారు.
పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. స్థానిక 12వ వార్డు పార్క్ రోడ్డులోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న మెటర్నిటీ సెంటర్‌లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 0–5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
నర్సాపురం పురపాలక సంఘ పరిధిలోని ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
ఆదివారం జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్, నర్సాపురం పురపాలక సంఘ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటారని కమిషనర్ తెలిపారు.
