శ్రీశైల దేవస్థానానికి 50 పీఓఎస్ మిషన్ల విరాళం

డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేత

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీశైలం శాఖ ఆధ్వర్యంలో 50 పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లను శనివారం విరాళంగా అందజేశారు.

దేవస్థానం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకు అధికారులు ఈ పీఓఎస్ మిషన్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావుకు అందజేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కొత్త పీఓఎస్ మిషన్ల ద్వారా భక్తులు దేవస్థానంలోని వివిధ కౌంటర్లలో సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చని చెప్పారు. ఈ మిషన్లను టోల్‌గేట్, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం, ప్రసాదాల కౌంటర్లు తదితర ప్రాంతాల్లో వినియోగించనున్నట్లు వెల్లడించారు.

భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మిషన్లను విరాళంగా అందించడం అభినందనీయమని పేర్కొంటూ బ్యాంకు అధికారులకు ఈవో కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాసకుమార్, కర్నూలు రీజినల్ హెడ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి. అనిల్‌కుమార్, స్థానిక బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.