కనకదుర్గమ్మ సేవలో కేంద్రమంత్రి..

ఖాన్ సాహు కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
దేశ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించిన కేంద్ర మంత్రి

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పీ నారాయణ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, ఏఈవో సీసీ రెడ్డి తదితరులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మంత్రులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి ప్రసాదం చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తోఖాన్ సాహు మాట్లాడుతూ, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.