కేటీఆర్ విమర్శలు అర్థరహితం

  • మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్

అశ్వారావుపేట టౌన్, ఆంధ్రప్రభ: బుధవారం పాలేరు పర్యటనకు వచ్చిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ అన్నారు.

గురువారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో జూపల్లి రమేష్ మాట్లాడుతూ, పది సంవత్సరాలపాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని వెంటనే సరిచేయడం ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదన్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల వరకు ప్రస్తుతం గతంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారని పేర్కొన్నారు.

రాజకీయాల్లో సభ్యత అవసరమని, సభ్యత మరిచి ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలు మెచ్చిన నాయకులని, గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని అన్నారు.

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల అవిశ్రాంత కృషితో బీఆర్‌ఎస్ గడీలు బద్దలయ్యాయని వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాలే ఆయనకు జీవనాధారం కాదని, దశాబ్దాలుగా ఆయన కుటుంబానికి విస్తృతమైన వ్యాపారాలు ఉన్నాయని, రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఆయనకు లేదని పేర్కొన్నారు.

అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందారని, అలాంటి వ్యక్తులను కేటీఆర్ విమర్శించడం నీతిమాలిన చర్య అని అన్నారు.

పాలేరు పర్యటనలో కేటీఆర్ చేసిన విమర్శలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జూపల్లి రమేష్ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మా రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, కక్కిరాల రమేష్, పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.