Traffic Advisory | జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

Traffic Advisory | జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచన

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు (Traffic Advisory) చేస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ గేట్-1, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మధ్య రహదారులపై మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెం.2 ప్రాంతాన్ని వీలైనంత వరకు నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.

ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రియల్‌టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను వినియోగించాలని, ప్రజా రవాణా లేదా కార్‌పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

భారీ వాహనాలు పీక్ అవర్స్‌లో ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రోడ్డుపై ఏర్పాటు చేసిన మార్గదర్శక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపు ఇలా…

ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు ఎస్‌ఎన్‌టీ జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లించి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నెం.5, వెంకటగిరి క్రాస్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చేరుకోవాలి.

కేసీపీ, బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తాజ్ కృష్ణ వద్ద మళ్లించి రోడ్ నెం.10, సిటీ సెంటర్, జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, రోడ్ నెం.45 మీదుగా పంపిస్తారు.

మసాబ్‌ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నెం.1/12 వద్ద మళ్లించి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్, రోడ్ నెం.45 మార్గంలో తరలిస్తారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం.36, 45 నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, రోడ్ నెం.2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీ మీదుగా మళ్లిస్తారు.

బేగంపేట్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు వెళ్లే వాహనాలు ఎన్‌ఎఫ్‌సీఎల్ వద్ద నుంచి రోడ్ నెం.1/4, 1/7, తాజ్ కృష్ణ, సిటీ సెంటర్, జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ హాస్పిటల్, భారతీయ విద్యాభవన్, రోడ్ నెం.45 మార్గాన్ని వినియోగించాలి.

ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట ఫ్లైఓవర్‌ను వినియోగించవద్దని సూచించారు. కాకతీయ హోటల్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్డును ఉపయోగించి పంజాగుట్ట క్రాస్ రోడ్స్, ఎన్‌ఎఫ్‌సీఎల్, రోడ్ నెం.10 బంజారాహిల్స్ వైపు వెళ్లాలని తెలిపారు.

ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, రద్దీ సమయాల్లో ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించి నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply