నవ్యాంధ్ర అభివృద్ధికి సహకరించండి

నవ్యాంధ్ర అభివృద్ధికి సహకరించండి

  • రాజ్యసభ అభ్యర్థులకు ఎంపీ కేశినేని చిన్ని శుభాకాంక్షలు

విజయవాడ, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా టీడీపీ నుండి ప్రకటించబడిన సానా సతీష్, చింతకాయల విజయ్,జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్‌లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. దేశ అత్యున్నత సభలలో ఒకటైన,భారత దేశ పెద్దల సభగా పిలువబడే రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నూతన సభ్యులు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ దృష్టిని మరింతగా ఆకర్షించి నవ్యాంధ్ర పురోగతికి కృషి చేయాలని సూచించారు.

రాజ్యసభకు ఎంపికైన ముగ్గురు నాయకులు తమ అనుభవం, సామర్థ్యంతో రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకువస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా, రాష్ట్ర హక్కులు మరియు అభివృద్ధి అవసరాలను జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. “రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నవ్యాంధ్ర అభివృద్ధే ధ్యేయంగా రాజ్యసభలో మీ సేవలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులు కూడా ఎంపీ కేశినేని చిన్ని అందించిన అభినందనలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply