World Boxing Cup 2026 | రింగ్ లో దిగే భారత్ జట్టు ఇదే !!
World Boxing Cup 2026 | రింగ్ లో దిగే భారత్ జట్టు ఇదే !!
- మీనాక్షి, దీపక్ నేతృత్వంలో బరిలోకి భారత్
- చైనాలో జరిగే వరల్డ్ బాక్సింగ్ కప్‌పై భారత ఆశలు
భారత బాక్సింగ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్… చైనా వేదికగా జరగనున్న మెగా టోర్నీలో మన పంచ్‌ల పవర్ చూపించడానికి టీమిండియా బాక్సర్లు రెడీ అయ్యారు. చైనాలోని గుయాంగ్ నగరంలో జూన్ 15 నుంచి 21 వరకు వరల్డ్ బాక్సింగ్ కప్ 2026 (స్టేజ్-2) (World Boxing Cup 2026) పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) తాజాగా హై-వోల్టేజ్ జట్టును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌లో భారత సవాల్‌కు ఇద్దరు సంచలన బాక్సర్లు నాయకత్వం వహించబోతున్నారు.
ప్రపంచ బాక్సింగ్ రింగ్‌ను శాసిస్తున్న ప్రెజెంట్ వరల్డ్ నంబర్-1 బాక్సర్ మీనాక్షి, చైనాలో గోల్డ్ మెడలే టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. తన పంచ్ పవర్ తో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేసే పక్కా అనుభవజ్ఞుడు దీపక్, మీనాక్షితో కలిసి భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు.
ఇక ఈ జట్టులో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ ట్రయల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన బాక్సర్లకు అవకాశం కల్పించారు. ప్రధాన జట్టుకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన ఈ బృందం అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవలి వరల్డ్ బాక్సింగ్ కప్ సిరీస్‌లలో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. పలు దశల్లో వరుసగా పతకాలు సాధించడంతో పాటు ఫైనల్స్‌లోనూ మెరుగైన ఫలితాలు నమోదు చేసి ప్రపంచ బాక్సింగ్‌లో తన స్థాయిని మరింత పెంచుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో అత్యధిక మంది బాక్సర్లు ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మహిళల విభాగంలో 51 కేజీల విభాగానికి చెందిన మీనాక్షి జట్టుకు నాయకత్వం వహించనుండగా, పూనమ్ (54 కేజీలు), ప్రాచి (57 కేజీలు), మహి లామా (60 కేజీలు), సనేహ్ (65 కేజీలు), గిటిమోని జి (70 కేజీలు), సనమాచా సి (75 కేజీలు), నైనా (80 కేజీలు), అల్ఫియా తరన్నుమ్ అక్ఱం ఖాన్ పఠాన్ (+80 కేజీలు) జట్టులో చోటు దక్కించుకున్నారు.
పురుషుల విభాగంలో 70 కేజీల విభాగానికి చెందిన దీపక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. అతడితో పాటు రిషి ఎస్ (50 కేజీలు), నిఖిల్ (55 కేజీలు), అన్మోల్ (60 కేజీలు), అభినాష్ జమ్వాల్ (65 కేజీలు), మల్సావ్మ్టులువాంగ (80 కేజీలు), జుగ్నూ (85 కేజీలు), హర్ష్ చౌదరి (90 కేజీలు), సావన్ జి (+90 కేజీలు) జట్టులో ఉన్నారు.
భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ మాట్లాడుతూ.. “వరల్డ్ బాక్సింగ్ కప్ మా బాక్సర్లకు అత్యున్నత స్థాయి అంతర్జాతీయ పోటీదారులతో తలపడే గొప్ప వేదిక. అన్ని బరువు విభాగాల్లో భారత్ లోతైన ప్రతిభను కలిగి ఉందని ఇటీవలి ఫలితాలు నిరూపిస్తున్నాయి. ప్రపంచ బాక్సింగ్ శక్తిగా భారత్ ఎదుగుతున్న తీరు గర్వకారణం” అని పేర్కొన్నారు.
