Vaibhav Sooryavanshi | నా టార్గెట్ అదే !
Vaibhav Sooryavanshi | నా టార్గెట్ అదే !
- వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తన భవిష్యత్ లక్ష్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ గురించి గత కొంతకాలంగా ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు బద్దలు కొట్టి, ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎంవీపీ అవార్డును సొంతం చేసుకున్న ఈ 15 ఏళ్ల యువ సంచలనం.. భవిష్యత్తులో కేవలం టీ20 క్రికెట్‌కే పరిమితమవుతాడా? లేక టెస్టు క్రికెట్‌లోనూ తన ముద్ర వేస్తాడా? అనే ప్రశ్నలకు ఇప్పుడు అతడే సమాధానం ఇచ్చాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల కోసం తొలిసారి టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న ఈ 15 ఏళ్ల యువ ఓపెనర్.. తాను కేవలం టీ20లకే పరిమితం కావాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే తన అంతిమ లక్ష్యం భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడటమేనని తెలిపాడు. టీ20 జట్టులో చోటు దక్కడం ఆనందంగా ఉందని, కానీ రెడ్ బాల్ క్రికెట్‌పై తనకు ప్రత్యేకమైన మక్కువ ఉందని వైభవ్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి భారత క్రికెటర్ కల అని, ఆ కలను నెరవేర్చుకోవడానికి మరింత కష్టపడతానని చెప్పాడు.
అంతేకాదు.. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాలన్నదే తన లక్ష్యమని చెప్పి తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాడు. టీ20ల్లో సిక్సర్లతో అలరించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. టీ20ల్లో దూకుడుగా ఆడుతున్నానని, కానీ టెస్టు క్రికెట్‌లో కూడా అదే శైలిని కొనసాగిస్తానని అనుకోవద్దని స్పష్టం చేశాడు వైభవ్ సూర్యవంశీ.
ప్రస్తుతం తనకు గుర్తింపు తెచ్చింది వేగవంతమైన బ్యాటింగ్, భారీ సిక్సర్లేనని అంగీకరించిన వైభవ్.. టెస్టు క్రికెట్ మాత్రం పూర్తిగా భిన్నమైన ఫార్మాట్ అని చెప్పాడు. అక్కడ ఓర్పు, క్రమశిక్షణ, పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యం అవసరమని పేర్కొన్నాడు.
రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిండర్‌తో మాట్లాడుతూ.. “నేను రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. అందుకోసం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ టీ20 ఫార్మాట్ ఏం కోరుకుంటుందో దానికి అనుగుణంగానే బ్యాటింగ్ చేస్తున్నాను. టెస్టు క్రికెట్ ఆడితే ఆ ఫార్మాట్‌కు అవసరమైన విధంగా నా ఆటను మార్చుకుంటాను. అలాగే వన్డేల్లో కూడా ఆ ఫార్మాట్ అవసరాలకు అనుగుణంగా ఆడతాను” అని తెలిపాడు.
ఇప్పటికే అండర్-19 స్థాయిలో తన ప్రతిభను నిరూపించిన వైభవ్.. ఐపీఎల్‌లోనూ ప్రపంచ స్థాయి బౌలర్లపై దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ ప్రదర్శనలే అతడికి సీనియర్ జట్టులో చోటు కల్పించాయి. ప్రస్తుతం అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, తన ఆటతో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
వైభవ్‌కు ఇప్పుడు టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభిస్తే, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశముంది.
ఆల్-ఫార్మాట్ స్టార్‌గా ఎదుగుతాడా?
కాగా, మూడు ఫార్మాట్లలోనూ భారత్‌కు ఆడటమే తన కల అని చెబుతున్న ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్‌కు టెస్టు క్రికెట్‌లోనూ గొప్ప భవిష్యత్తు ఉందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం అతడి రెడ్ బాల్ గణాంకాలు చూస్తే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందనే విషయం స్పష్టమవుతోంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ కేవలం 207 పరుగులు మాత్రమే చేశాడు. 17.25 సగటుతో బ్యాటింగ్ చేసిన అతడు 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే నమోదు చేశాడు. టీ20ల్లో చూపిస్తున్న ఆధిపత్యాన్ని ఇప్పటివరకు రెడ్ బాల్ క్రికెట్‌లో ప్రదర్శించలేకపోయాడు.
అయితే గణాంకాలు అంతగా ఆకట్టుకోకపోయినా, ప్రతిభ మాత్రం కనిపించిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో వైభవ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆ టూర్లలో 223 పరుగులు చేసి 31.85 సగటు నమోదు చేశాడు. కఠిన పరిస్థితుల్లో కూడా నిలదొక్కుకునే సామర్థ్యం తనకు ఉందని అక్కడ నిరూపించాడు.
ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్, చేతేశ్వర్ పుజారా, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజాలు వైభవ్‌ను భవిష్యత్ టెస్టు స్టార్‌గా అభివర్ణించారు. అయితే టెస్టు క్రికెట్‌లో విజయవంతం కావాలంటే ఓర్పు, క్రమశిక్షణ, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
టీ20ల్లో బౌలర్లపై విరుచుకుపడే వైభవ్.. భవిష్యత్తులో వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో దూకుడు, స్థిరత్వాన్ని కలిపి అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తే భారత క్రికెట్‌కు మరో అరుదైన ఆల్-ఫార్మాట్ స్టార్ దొరికినట్టే. ప్రస్తుతం అతడి వయసు, ప్రతిభ, ఆత్మవిశ్వాసం చూస్తే ఆ అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
