మంగినపూడి సముద్ర తీరాన యోగ విన్యాసం
మంగినపూడి సముద్ర తీరాన యోగ విన్యాసం
ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
కనువిందుగా సాగిన యోగాసనాలు
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : సముద్ర కెరటాల ఘోష, ఆహ్లాదకరమైన ఉదయపు గాలుల మధ్య మంగినపూడి బీచ్ తీరం యోగా వేదికగా మారింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం మంగినపూడి బీచ్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవంలో పాల్గొని యోగాసనాలు చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

శారీరక మానసిక రుగ్మతులతో బాధపడే ప్రజలు ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్య జీవన విధానాన్ని కొనసాగించాలని తెలిపారు. యోగా చేయడం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడమే అని తెలిపారు. శరీరం మొత్తంలో కలిగిన అనేక బలహీనతలు తొలగించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.

