Rajya Sabha Elections | కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఖర్గే సహా ఏడుగురికి అవకాశం
Rajya Sabha Elections | కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. ఖర్గే సహా ఏడుగురికి అవకాశం
దేశవ్యాప్తంగా జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక/ఉప ఎన్నికలకు (Biennial/Bye-Elections to the Rajya Sabha – 2026) సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తమ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ అధికారిక ప్రెస్ రిలీజ్ గురువారం (జూన్ 4) సాయంత్రం విడుదలైంది. వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్ లీడర్లతో పాటు కీలక ప్రతినిధులకు ఈ జాబితాలో చోటు దక్కింది.
రాజ్యసభ అభ్యర్థుల పూర్తి జాబితా…
కర్ణాటక నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్లకు పార్టీ రాజ్యసభ టికెట్లు కేటాయించింది. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్‌కు అవకాశం కల్పించింది.
రాజస్థాన్ నుంచి నీరజ్ దంగీని అభ్యర్థిగా ఎంపిక చేయగా, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి పేరును ఖరారు చేసింది. జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ అనుభవం, రాష్ట్రాల వారీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు పోటీ చేయనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

