శుక్రవారం రద్దీకి ఇంద్రకీలాద్రి సిద్ధం
శుక్రవారం రద్దీకి ఇంద్రకీలాద్రి సిద్ధం
భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ఈవో శీనా నాయక్ ఆదేశాలు
విజయవాడ, ఆంధ్రప్రభ:
వేసవి సెలవుల ముగింపు నేపథ్యంలో శుక్రవారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆలయ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ గురువారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై విస్తృతంగా పర్యటించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
కొండపైన, కొండకింద తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, ప్రసాద పంపిణీ కేంద్రాలు, రవాణా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. క్లోక్రూములు, చెప్పుల స్టాండ్లు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు సమయానికి ప్రారంభించడంతో పాటు క్యూ లైన్లలో చల్లని తాగునీరు నిరంతరం అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఆలయ పరిసరాల్లోని మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు ఎక్కడా అపరిశుభ్రత లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఉచిత ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా కొనసాగిస్తూ ప్రతి భక్తుడికి ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల ప్రక్రియను వేగవంతం చేసి, ముఖమంటప దర్శనాన్ని సకాలంలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాల నిర్వహణలో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఆన్లైన్ లావాదేవీలు, మనమిత్ర వాట్సాప్ సేవలు, సాంకేతిక వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, భక్తుల సంఖ్య పెరిగినా సేవల్లో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇంజనీరింగ్, సెక్యూరిటీ, ప్రోటోకాల్, రవాణా, పరిశుభ్రత తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలని ఈవో శీనా నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని తెలిపారు.
