ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దేవినేని వెంకటరమణ…

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత దేవినేని వెంకటరమణ…

రమణ ఘాట్ వద్ద నివాళులర్పించిన మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే సౌమ్య
రమణ విగ్రహావిష్కరణ, అన్నదాన కార్యక్రమం..

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : సమాజానికి మంచి చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దివంగత దేవినేని వెంకటరమణ 27వ వర్ధంతి వేడుకలు మండల కేంద్రమైన కంచికచర్లలో గురువారం ఘనంగా జరిగాయి. దేవినేని రమణ ఘాట్ వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా స్థానిక చెవిటికల్లు రోడ్డు సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన దేవినేని వెంకటరమణ విగ్రహాన్ని ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి దేవినేని ఉమా ఆవిష్కరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో దేవినేని రమణ ప్రణీత, తంగిరాల ప్రభాకర్ రావుల చిత్రపటాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన దేవినేని వెంకటరమణ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని కొనియాడారు. రమణనన్న ఎమ్మెల్యేగా గెలుపొందడంతోనే నియోజకవర్గ అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు.

ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నియోజకవర్గానికి త్రాగేందుకు నీరు అందించడమే కాక, పంటలు సాగు చేసుకునేందుకు ప్రతి రైతు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించిన ఘనత రమణకే దక్కిందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖలో కీలక మార్పులు తెచ్చి, ప్రతి పేద విద్యార్థినికి ఉచిత విద్యను అందించే దిశగా అడుగులు వేశారన్నారు. రమణ తనకు ఆదర్శం అని, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయడంలో ఆయనే స్ఫూర్తిదాయకమని, రమణన్న అడుగుజాడల్లోనే నడుచుకుంటునన్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ దివంగత దేవినేని రమణ, తంగిరాల ప్రభాకర్ రావులు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇరువురు మహానేతలు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

వారి స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి అంకితమవుతామన్నారు. కార్యక్రమాలలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, మాజీ సర్పంచులు, నీటి సంఘం అధ్యక్షులు, వివిధ హోదాల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, తెలుగు దేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply