పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై కేంద్రానికి ఎమ్మెల్యే పాయం వినతి

పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై కేంద్రానికి ఎమ్మెల్యే పాయం వినతి

గోదావరి ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలి

ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలి

రైతులకు పరిహారం, నిర్వాసితులకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి

బూర్గంపాడు, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పలు గ్రామాలు, వ్యవసాయ భూములు, ప్రజల జీవనోపాధి, మౌలిక సదుపాయాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి సంజయ్ నందన్‌కు ఆయన సమగ్ర వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో తీవ్ర ముంపు ముప్పు నెలకొనే అవకాశం ఉందన్నారు. అధికారిక అంచనాల కంటే వాస్తవ పరిస్థితుల్లో మరింత విస్తీర్ణంలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యే పరిస్థితి తలెత్తవచ్చని అన్నారు.

గోదావరి వరదల సమయంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే వివరించారు. వాగులు, ఉపవాగులు, సహజ నీటి పారుదల మార్గాలపై బ్యాక్‌వాటర్ ప్రభావం పడితే నీటి నిల్వ సమస్యలు పెరిగి వ్యవసాయం, గ్రామీణ జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

అశ్వాపురంలోని దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన హెవీ వాటర్ ప్లాంట్ భద్రతకు కూడా భవిష్యత్తులో ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో సమగ్ర శాస్త్రీయ బ్యాక్‌వాటర్ సర్వే నిర్వహించాలని, ఉపనదులపై బ్యాక్‌వాటర్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని కోరారు.

భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని, నిర్వాసితుల కోసం ప్రత్యేక పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే శాశ్వత వరద నియంత్రణ చర్యలు, రక్షణ కరకట్టలు, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, నిపుణులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. శాస్త్రీయ అధ్యయనం, ప్రజాభిప్రాయం లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను సంబంధిత వర్గాలతో సంప్రదింపులు లేకుండా అమలు చేయరాదని పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సంబంధిత అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.


Leave a Reply