OnJune6th | కాక్రోచ్ జనతా పార్టీ కొత్త టర్న్!
OnJune6th | ఆంద్రప్రభ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా ప్రారంభమై, ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కీలక మలుపు తిరిగింది. కేవలం మీమ్స్, ఆన్‌లైన్ ప్రచారాలకే పరిమితం కాకుండా, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోసం ఈ సంస్థ ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైంది.
జూన్ 6న జంతర్ మంతర్ వద్ద నిరసన..
నీట్, సీబీఎస్, సీయూఈటీ, ఎస్ఎస్సీ జీడీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న ఢిల్లీలో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు.
భారీ రిస్క్ తీసుకుంటున్న వ్యవస్థాపకుడు..
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అభిజీత్ దిప్కే, స్వదేశానికి తిరిగి రావడంపై కుటుంబ సభ్యులు, మిత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, తను వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు. “ఎయిర్‌పోర్టులో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా సరే, ప్రజాస్వామ్యబద్ధంగా నా నిరసనను వ్యక్తం చేయడానికి నేను సిద్ధం” అని ఆయన ప్రకటించారు.
సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు..
ఈ ఉద్యమానికి ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. ఒకవేళ జూన్ 5లోపు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే, జూన్ 6న జరిగే నిరసనలో తాను స్వయంగా పాల్గొంటానని ఆయన తేల్చి చెప్పారు. సీజేపీ అనేది విదేశీ శక్తుల ప్రభావంతో కాకుండా, దేశభక్తితో విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువత వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు.
సంస్థాగత మార్పులు..
ఉద్యమాన్ని మరింత పటిష్టం చేసే దిశగా సీజేపీ అడుగులు వేస్తోంది. ఇటీవల తమ అధికారిక ప్రతినిధులను ప్రకటించి, ఒక వ్యవస్థీకృత పోరాట సంస్థగా తన ఉనికిని చాటుకుంటోంది. దాదాపు 8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పోరాటానికి మద్దతుగా ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు.
ప్రశ్నగా మిగిలిన భవిష్యత్తు..
ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. అయితే, సీజేపీ మాత్రం తాము ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం లేదని, ఇది కేవలం విద్యార్థుల సమస్యల కోసం జరుగుతున్న స్వతంత్ర పోరాటమని స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియా డ్రామాగా మొదలైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం, జూన్ 6న ఢిల్లీ వేదికగా జరగబోయే నిరసనతో నిజంగానే వ్యవస్థలో మార్పు తీసుకుతీసుకువస్తుందా? లేక రాజకీయ తుఫానులో కొట్టుకుపోతుందా? అన్నది వేచి చూడాలి.
