India US Trade Talks | సెక్షన్ 301 విచారణపై భారత్-అమెరికా సంప్రదింపులు
India US Trade Talks | సెక్షన్ 301 విచారణపై భారత్-అమెరికా సంప్రదింపులు
India US Trade Talks | భారత్ దిగుమతులపై 12.5 శాతం అదనపు సుంకం ప్రతిపాదన
వెట్టిచాకిరీ దిగుమతుల అంశంపై యూఎస్టీఆర్ నివేదిక
ప్రతిపాదన మాత్రమే.. ఇంకా ఖరారు కాలేదన్న కేంద్రం
సెక్షన్ 301 విచారణపై భారత్-అమెరికా సంప్రదింపులు
సుంకాల ఉపశమనం కోరనున్న భారత్ వర్గాలు
India US Trade Talks | న్యూఢిల్లీ: ఢిల్లీలో అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు జరుగుతుండగా, మరోవైపు అమెరికా భారతదేశ దిగుమతులపై 12.5 శాతం అదనపు సుంకాన్ని ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్య న్యూఢిల్లీలో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను క్లిష్టతరం చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, ఇంకా ఖరారు కాలేదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
వెట్టిచాకిరీ కార్మికులతో తయారైన దిగుమతులను అరికట్టడంలో విఫలమైన 60 ఆర్థిక వ్యవస్థలలో భారత్ కూడా ఒకటని అమెరికా పేర్కొంది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, అసిస్టెంట్ యూఎస్టీఆర్ బ్రెండన్ లించ్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం మధ్య మంగళవారం నుంచి చర్చలు ప్రారంభమయ్యాయి. గురువారం వరకు ఈ చర్చలు జరగనున్న నేపథ్యంలో బుధవారం యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం 92 పేజీల నివేదిక విడుదల చేసింది.
వెట్టిచాకిరీ కార్మిక దిగుమతులపై నిషేధాన్ని విధించడంలో, సమర్థవంతంగా అమలు చేయడంలో భారత్ విఫలమైందని ఆ నివేదికలో పేర్కొన్నారు. భారతదేశ విధానాలు అసమంజసమైనవని, అమెరికా వాణిజ్యానికి భారమని పేర్కొంది. వెట్టిచాకిరీ కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతి సమస్యను పరిష్కరించడంలో తమ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు విఫలం కావడం ఆమోదయోగ్యం కాదని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ అన్నారు. దీనివల్ల అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీపడవలసిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెట్టిచాకిరీ కార్మిక దిగుమతులపై నిషేధం లేని 54 ఆర్థిక వ్యవస్థల జాబితాలో అమెరికా భారత్‌ను కూడా చేర్చింది. అందువల్ల ప్రతిపాదిత 12.5 శాతం అధిక సుంకాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాలు ఇటువంటి దిగుమతులపై నిషేధాన్ని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైనందున ఆ దేశాలపై 10 శాతం సుంకాన్ని ప్రతిపాదించింది.
ప్రతిపాదన మాత్రమే: భారత్
అయితే ప్రతిపాదిత సుంకాలు ఇంకా ఖరారు కాలేదని, ఈ చర్యలపై నిర్ణయం తీసుకునే ముందు యూఎస్టీఆర్ ఆయా దేశాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. సెక్షన్ 301 విచారణలో భాగంగా ఈ విషయంపై భారత్ అమెరికాతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత్ అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించింది.
అయితే యూఎస్టీఆర్ విచారణ భారత ఎగుమతులలో వెట్టిచాకిరీ విధానం గురించి కాదని, ఇతర దేశాలలో వెట్టిచాకిరీ కార్మిక విధానంతో ముడిపడి ఉన్న దిగుమతులను భారత్ నిరోధించిందా లేదా అనే దాని గురించేనని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. అమెరికా ప్రతిపాదనను సవాలు చేయవచ్చని తెలిపారు. ప్రతిపాదిత సుంకాలు విస్తృతమైన అమెరికా ఒత్తిడి వ్యూహాలలో భాగం మాత్రమేనని, 301 చర్యలను, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను వేరువేరుగా చూడాలని ఆయన అన్నారు.
భారత పర్యటనలో ఉన్న లించ్ బృందంతో సెక్షన్ 301 దర్యాప్తు విషయాన్ని ప్రస్తావించి, విస్తృతమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా సుంకాల ఉపశమనం కోరాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సుంకాల ప్రతిపాదనపై జూలై 6లోగా ప్రభుత్వాభిప్రాయాలను కోరిన యూఎస్టీఆర్, జూలై 7న విచారణ జరపనుంది.
