పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ
పాయకాపురం, ఆంధ్రప్రభ: అవినీతికి తావులేకుండా పింఛన్ల పంపిణీ చేయడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రత్యేకత అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
సోమవారం స్థానిక 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్ ఆధ్వర్యంలో, 1వ డివిజన్ గుణదల వంతెన సమీపంలోని కృష్ణ హోటల్ కట్ట ప్రాంతంలో డివిజన్ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ సమక్షంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
గత 24 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.70 వేల కోట్లకు పైగా వ్యయం చేసి సామాజిక భద్రత కల్పించినట్లు తెలిపారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు చేరేలా పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ 64వ డివిజన్ అధ్యక్షుడు కె. రవికుమార్, 1వ డివిజన్ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
