సమ్మర్ క్యాంప్ పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్ర

మామడ, ఆంధ్రప్రభ ; విద్యార్థులు సమ్మర్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్ర అన్నారు. గురువారం మామడ మండలంలోని న్యూ సాంగ్వి కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యా వారోత్సవాలలో భాగంగా సమ్మర్ క్యాంపు ను పరిశీలించారు.విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించారు. కేవలం పుస్తకాల్లోని చదువే కాకుండా, నిత్య జీవితంలో విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో ఉదాహరణలతో వివరించారు. అనంతరం విద్యార్థినులకు కొన్ని ప్రశ్నలు వేసి, వారి విద్యా సామర్థ్యాలు, నైపుణ్యాలను పరీక్షించారు. బాలికలు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు.
వేసవి సెలవులను వృథా చేయకుండా, ఇలాంటి శిక్షణా శిబిరాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకుని ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థినుల భద్రత, వారికి అందుతున్న వసతులు, తాగునీరు మరియు భోజన సదుపాయాలపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, యంఈవో వెంకట రమణ రెడ్డి, పాఠశాల ప్రత్యేకధికారి జ్యోతి, ఉపాధ్యాయులు ఉన్నారు.
