ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యుడికి ఘన స్వాగతం

ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యుడికి ఘన స్వాగతం

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన టీపీసీసీ (TPCC) అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్‌ను ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యునిగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సోమవారం తన సొంత గ్రామమైన ఉప్లూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి, గ్రామ శివారులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఆయనకు నీరాజనాలు పడుతూ భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుండి గ్రామ ప్రజలు, కార్యకర్తలతో కలిసి స్థానిక బాల రాజేశ్వరస్వామి దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన పాల్గొన్నారు.

మన గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శైలేందర్
ఈ సభలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ.. మన ఉప్లూర్ గ్రామ ముద్దుబిడ్డ, ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించి, రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మంచి పేరు తెచ్చుకుని, నేడు ప్రభుత్వ పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మెంబెర్‌గా నియమితులు కావడం మన ఉప్లూర్ గ్రామానికి ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తా: వేణుగోపాల్ యాదవ్
సన్మాన గ్రహీత, ట్రిబ్యునల్ మెంబెర్ బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఇంతటి ఘన స్వాగతం పలికిన కన్నతల్లి లాంటి గ్రామ ప్రజలకు, మహిళలకు, యువతకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అప్పగించిన బాధ్యతలను అత్యంత నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు శ్రమిస్తానని, అలాగే తన సొంత గ్రామ అభివృద్ధిలో భాగస్వామియై, ఉప్లూర్ ప్రగతికి అవసరమైన ప్రభుత్వ నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ ఘన స్వాగత , సన్మాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, మండల ఉపాధ్యక్షుడు వన్నెల రాజేశ్వర్, యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షుడు నరేందర్, ముఖ్య నాయకులు గంగరెడ్డి, తిరుపతి రెడ్డి, అడ్వకేట్ సుంకరి విజయ్ కుమార్, సాధుల్లా, రాకేష్, అనిల్, డాక్టర్ నరేష్, శ్రీనివాస్, సాధిక్, ఆంజనేయులు, సల్మాన్, క్రాంతి రెడ్డి, సాగర్, రమేష్, ఉబెద్, సాగర్ పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.