ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం

పెనమలూరు, ఆంధ్రప్రభ : ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించే దేవాలయాలు సమాజంలో ఐక్యతను, సాంప్రదాయ విలువలను మరింత బలపరుస్తాయని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు గౌరీ శంకర్ నగర్‌లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ – బోడే హేమ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ.. దేవాలయాలు కేవలం పూజలు చేసే స్థలాలు మాత్రమే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. ప్రజల్లో భక్తి భావనతో పాటు పరస్పర సహకారం, సామాజిక ఐక్యత పెంపొందించడంలో ఆలయాల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

కానూరు ప్రాంత ప్రజల సహకారంతో నిర్మాణం చేపడుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు,కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.