HYD | రహదారిని 120 అడుగులకు విస్తరించాలి..

HYD | రహదారిని 120 అడుగులకు విస్తరించాలి..

HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, రహదారుల విస్తరణపై వ్యక్తిగతంగా చొరవ చూపాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రయాణికుల సౌకర్యార్థం పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

నగరానికి నాలుగో ప్రధాన టెర్మినల్‌గా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2025 జనవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రయాణికుల రాకపోకలకు సరైన రహదారి సదుపాయం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్డు నుంచి కొత్త భవనం వరకు 200 అడుగుల రోడ్డును, భరత్ నగర్ వైపు ఉన్న రోడ్డును 100 అడుగుల వరకు విస్తరించాలని సూచించారు. అలాగే ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం వైపు వెళ్లే ఇరుకైన రోడ్డును 100 మీటర్ల వెడల్పు, 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాలని కోరారు.

పార్కింగ్ అవసరాల కోసం స్టేషన్‌కు ఇరువైపులా సుమారు 5.7 ఎకరాల భూమిని కేటాయించాలని, రైల్వే శాఖ ఇప్పటికే రూ.4 కోట్లు చెల్లించినందున తక్షణమే నీటి కనెక్షన్ ఇవ్వాలని కోరారు. ఇక రూ.715 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ స్టేషన్ వద్ద ఆల్ఫా హోటల్ నుంచి రాటిఫైల్ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగులకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ పలుమార్లు ఈ విషయంపై లేఖలు రాసినా పనులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగడం లేదని, నగర రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply