తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు

తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు

  • మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్

నంద్యాల, ఆంధ్రప్రభ నంద్యాల నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ కమిషనర్ సహా సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో తాగునీటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో నియోజకవర్గంలోని అర్బన్, రూరల్ ప్రాంతాలు మరియు గోస్పాడు మండలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానంగా కే.సీ. కెనాల్‌పై ఆధారపడి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాలో సమస్యలు ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీ సమన్వయం ఉంటే ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని వారు తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా మున్సిపల్ శాఖ అవసరమైన సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పట్టణాభివృద్ధి అంశంపై మంత్రి, కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అనియంత్రితంగా జరుగుతున్న నిర్మాణాలను నియంత్రించి, క్రమబద్ధమైన అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ సుందరీకరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి పట్టణాన్ని శుభ్రతలో ముందంజలో నిలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులు, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply