ఏపీటీడీసీకి హైకోర్టు గట్టి హెచ్చరిక..

ఏపీటీడీసీకి హైకోర్టు గట్టి హెచ్చరిక..
అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సంస్థలకు దేశ చట్టాలు వర్తించవన్న అపోహ నుంచి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ బయటపడాలని, మీరు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా చట్టం కంటే ఎవరూ పై స్థాయిలో లేరన్న న్యాయసూత్రాన్ని గ్రహించుకోవాలని ఏపీటీడీసీకి హైకోర్టు హితవు పలికింది. ఒక ప్రభుత్వ సంస్థగా ఉండి చట్టానికి తాము అతీతులమన్న విధంగా వాదించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వులు తమకు వర్తించవన్న ఏపీటీడీసీ వాదనను తప్పుపడుతూ, ఇది వింత వాదన అని స్పష్టం చేసింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామం తొట్లకొండ సమీపంలోని సర్వే నెంబర్ 314 పార్ట్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ‘బే వాచ్ రెస్టారెంట్’ పేరుతో నిర్మించిన వినోద కేంద్రం, హోటల్ నిర్మాణాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది.
ఈ నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించాలని జీవీఎంసీకి ఆదేశించింది. 2025 నవంబర్ 19న జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వులను మూడు వారాల్లో అమలు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ అంశంపై విశాఖపట్నం టౌన్ ఫిషర్ ఉమెన్ డ్రై ఫిష్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 2018లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అదే సమయంలో, జీవీఎంసీ 2025లో జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) 2026లో హైకోర్టును ఆశ్రయించింది.
ఈ రెండు వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం గురువారం తన తీర్పును వెలువరించింది. పర్యాటకాభివృద్ధి పేరిట నిర్మించిన కట్టడాల కూల్చివేతకు సంబంధించి తమకు నోటీసులు ఇవ్వలేదన్న ఏపీటీడీసీ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 2025లోనే జీవీఎంసీ అధికారులు సదరు నిర్మాణాలకు అనుమతులు చూపాలని ఏపీటీడీసీని కోరినా, పత్రాలు సమర్పించడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీటీడీసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా, నిర్మాణాలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
