ప్రైవేటీకరణ యత్నాలపై ఆగ్రహం…

ప్రైవేటీకరణ యత్నాలపై ఆగ్రహం…

  • ఆర్టీసీ ఉద్యమానికి తలసాని అండ

హైదరాబాద్, ఆంధ్రప్రభ ; ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో పాల్గొని, వారి సమ్మెకు మద్దతు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ మనుగడకు ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని విమర్శించారు.

ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ, కృషి అమూల్యమని తలసాని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తలసాని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ నేతల ప్రోత్సాహంతోనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. డిపోలను ప్రైవేట్ సంస్థలకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తలసాని డిమాండ్ చేశారు.

Leave a Reply