నిర్మానుషంగా మారిన ఆర్టీసీ ప్రాంగణం..

నిర్మానుషంగా మారిన ఆర్టీసీ ప్రాంగణం..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో మండల కేంద్రంలో గల ఆర్టీసీ ప్రాంగణం నిర్మానుషంగా మారింది. గత రెండు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో గల ఆర్టీసీ ప్రాంగణం ప్రయాణికులు లేక వెలవెలబోతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక డబ్బులు చెల్లించి ప్రయాణం చేయవలసి వస్తుంది. మండల కేంద్రంలో గల ఆర్టీసీ ప్రాంగణంలోకి అన్ని డిపోలకు చెందిన బస్సులు వస్తుండడంతో ఎప్పుడు ప్రయాణికులతో ఆర్టీసీ ప్రాంగణం కిటకిటలాడుతూ ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెతో బస్సులు ప్రాంగణంలోకి రాకపోవడంతో ప్రయాణికులు ఎవరు ఆర్టీసీ ప్రాంగణంలో కనిపించడం లేదు. ప్రైవేట్ వాహనాల కోసం రోడ్డుపై ఎండను సైతం లెక్కచేయకుండా వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ అధికారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి యధావిధిగా బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
