గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…

గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…

  • తక్కువ వేతనాలు, చట్టపరమైన హక్కుల లేమిపై ఆందోళన
  • కార్మిక చట్టాల అమలుకు ఏఐటీయూసీ ఉద్యమానికి సిద్ధం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని వేలాది గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిని తక్షణమే కార్మికులుగా గుర్తించి, వారికి చట్టపరమైన హక్కులు కల్పించాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుంపెల్లి మునీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సిబ్బంది ఏఐటీయూసీలో చేరిక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మునీశ్వర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, మినిమం వేతనాలు ఇవ్వకుండా కేవలం గౌరవ వేతనం పేరుతో పని చేయించడం దారుణమన్నారు. వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో పాటు ఎలాంటి చట్టపరమైన రక్షణలు లేకపోవడం బాధాకరమన్నారు.

గ్రామపంచాయతీ సిబ్బందిని కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపజేయించేందుకు అవసరమైన ఉద్యమ కార్యాచరణను ఏఐటీయూసీ చేపడుతుందని తెలిపారు. పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ప్రతినిధుల ద్వారా సిబ్బంది సమస్యలను తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ఈ సమావేశంలో 70 మంది గ్రామపంచాయతీ సిబ్బంది ఏఐటీయూసీలో చేరగా, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని చింతకింది కుమారస్వామి హామీ ఇచ్చారు.

మాజీ సర్పంచ్ చీకటి ప్రకాష్, బట్టు సాంబయ్య, పరికి కోర్నేల్, పరికి రత్నం మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బందిలో 99 శాతం ఎస్సీ వర్గానికి చెందిన వారే ఉన్నారని, వారి సమస్యల పరిష్కారానికి సంఘీభావం తెలుపుతామని పేర్కొన్నారు. సమావేశంలో మండల కమిటీని కూడా ఎంపిక చేశారు.

గౌరవ అధ్యక్షుడిగా జన్ను సుదర్శన్, అధ్యక్షుడిగా శనిగరం చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా మామిడి పెల్లి సంపత్, ఉపాధ్యక్షులుగా అంబి రాజు, పాశం యశోద, ముత్యాల రమా, కార్యదర్శులుగా కనకం రాజు, జాటోతు మోహన్ సింగ్, దండెం రాజ్‌కుమార్, కొత్తపల్లి సదానందం, సహాయ కార్యదర్శులుగా డి. పరన్ సింగ్, గజ్జి స్వప్న, కోశాధికారిగా మామిడి పెల్లి రవి, సభ్యులుగా మాట్ల సునిత, కారం శ్రీకాంత్, బూసార అప్పయ్య, కనకం కోర్నేలు, చింతక కరుణలను ఎంపిక చేశారు.

Leave a Reply