One Nation One Reservation | రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు

One Nation One Reservation | రిజర్వేషన్ వ్యవస్థలో అసమానతలు

One Nation One Reservation | బంజారా జాతి చరిత్ర మరియు మూలాలు
సంస్కృతి, సాంప్రదాయాల ప్రత్యేకత
సంచార జీవితం నుంచి ప్రపంచ వ్యాప్తం
వెనుకబడిన వాస్తవాలు మరియు సవాళ్లు
ఒకే రిజర్వేషన్ అవసరం – సామాజిక న్యాయం దిశగా

One Nation One Reservation | ప్రపంచంలో వీరులు లేని దేశం లేదు, వీరగాథలు లేని సాహిత్యమూ లేదు. భారతదేశంలో రాజపుత్రులకు జన్మభూమియైన రాజస్థాన్ వీరగాథల పురిటిగడ్డ. మాతృభూమి సంరక్షణలో ప్రాణాలను తృణప్రాయంగా బలిపెట్టిన మహావీరులు రాజపుత్రులు. ఈ రాజపుత్ర వంశానికి చెందిన వీర జాతియే నేటి సంచార జాతియైన “బంజారాలు”. వీరినే సుగాలి, లంబాణీ, లంబాడీ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

బంజారా (లంబాడీల) సంస్కృతి, సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడి ఉంటాయి. అతి ప్రాచీనమైన తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా వారు తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. పశుపోషణ వీరి జీవనాధారం. ప్రత్యేక పండుగలు, పంచాయతీ వ్యవస్థ కలిగి ఉన్నారు. దేశంలో సుమారు 1 లక్ష తండాలలో దాదాపు 18 కోట్ల జనాభాతో వీరు నివసిస్తున్నారు. సుమారు 67 దేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

భారతదేశంలో ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి దాకా వివిధ పేర్లతో పిలవబడుతున్నారు. వీరు రాజపుత్ర సైన్యాలు 11వ శతాబ్దంలో మూడు గ్రూపులుగా విడిపోయి, ఒక గ్రూపు రాజస్థాన్ కోటల్లో, ఒక గ్రూపు అడవులలో, మూడవ గ్రూపు ఇతర ప్రపంచ దేశాలకు వెళ్లిపోయారు. అలా 11వ శతాబ్దంలో వెళ్లిపోయిన వారినే జిప్సీలు అంటారు. వారే రోమా బంజారాలు. రోమా బంజారాలు అనగా రాముని దేశం నుండి వచ్చినవారమని చెప్పుకుంటారు.

తొలుత ఉత్తర భారత పాలకుల దండయాత్రలును చవిచూసి, లోది, మొఘల్ రాజ్యాలకు ఎదురొడ్డి నిలిచి సరుకు రవాణా చేస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా ఉండేవారు. తర్వాత బ్రిటిష్ వారితో తలపడి 1871లో ‘క్రిమినల్ ట్రైబ్’గా గుర్తించబడ్డారు. వీరిని దేశంలో అతిపెద్ద సంచార సమూహమని, భూమి ‘మూల రోమా’ అని పిలుస్తారు. బంజారాలు వందల సంవత్సరాల క్రితం భారతదేశం నుండి ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. ప్రతి సమూహం స్థిరపడిన ప్రాంతాల్లో లంబాడీల భాష ‘గోర్ బోలి’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ ప్రపంచంలో ఒకే భాష, ఆచార సంప్రదాయాలు ఉన్న జాతి లంబాడీ మాత్రమే.

బంజారా అనే పదం ‘బజికా’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అర్థం వ్యాపారం. వీరి మొదటి ప్రస్తావన క్రీ.శ. 1504లో ధోల్పూర్‌పై సికిందర్ లోడి దాడి చరిత్రలో కనిపిస్తుంది. ఔరంగజేబు సైన్యాల దండయాత్ర తర్వాత వారు దక్కనుకు వచ్చారు. చారిత్రక ఆధారాల ప్రకారం వీరి వంశం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది.

రాజస్థాన్‌లో స్థిరపడిన తర్వాత బంజారాలు 14వ శతాబ్దంలో దక్షిణానికి ప్రయాణించడం ప్రారంభించారు. రాజస్థాన్, వాయవ్య గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, స్వాతంత్ర్యానికి పూర్వం పాకిస్తాన్ తూర్పు సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సంచార జాతులుగా పేర్కొనబడ్డారు. వీరు అగ్నివంశీ రాజపుత్రుల వంశానికి చెందినవారిగా చెప్పుకుంటారు.

దేశంలో అనేక సమాజాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఎన్నో వెనుకబడిన జాతులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందులో బంజారా జాతి కూడా ఒకటి. వీరు వేలాది సంవత్సరాలుగా సమాజం, నగరాలు, ఇతర సామాజిక వ్యవస్థలకు దూరంగా బతుకుతున్నారు. అభివృద్ధి ఫలాలను కోల్పోయారు.

ఈశాన్య భారతం మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వీరి నివాసాలు ఉన్నాయి. వీరిని బంజార్, పిండారీ, బంగాళా, బంజోరి, బంజర్, లమాని, లమాడి, లంబానీ, లభాని, లంబారా, లావణి, లేమాడి, లుమదలే, లభని, ముకాగూలా, గుర్కర్తి అని పిలుస్తారు. గోర్మతి, కోరా సుగాలి, సుకలి, తండా, వంజరి, వంజర, వంజీ దొంబాతో కలిసి వీరిని ‘జిప్సీ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు.

దేశ విభజనకు ముందు అమర్‌కోట్, పతాయ్‌కోట్, సియాల్‌కోట్ ప్రాంతాల్లో భూస్వాములుగా ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్‌లలోని వంజారా కమ్యూనిటీకిచెందిన రాథోడ్, పవార్, చౌహాన్, జాదవ్ కులాలు జనరల్ సీట్లలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో, కర్ణాటక, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కాస్ట్‌లలో, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో డి-నోటిఫైడ్ జాబితాలో, మిగతా రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలో ఉన్నారు.

దేశంలో ఒకే జాతిగా ఉన్న వీరి రిజర్వేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రత్యేక భాష, ప్రత్యేక వస్త్రధారణ, సమాజానికి దూరంగా అడవి ప్రాంతాల్లో జీవించడం వీరి లక్షణాలు. 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయంలో బంజారాలను గిరిజన రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని పోరాడే అంబేద్కర్ లాంటి నాయకుడు లేకపోవడంతో లంబాడీలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రిజర్వేషన్లతో అట్టడుగుస్థాయిలోనే ఉండిపోయారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి దేశవ్యాప్తంగా ఉన్న బంజారా (లంబాడీ)లను ఒకే గిరిజన రిజర్వేషన్ జాబితాలో చేర్చాలి.

  • జటావత్‌ హనుము
    8519836308

Leave a Reply