అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో గ్రామాల తరలింపు స్వచ్ఛందం

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో గ్రామాల తరలింపు స్వచ్ఛందం
- బలవంతము లేదు – కోర్ ఏరియాలో నిబంధనలు కఠిన తరం
- జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర
అచ్చంపేట, ఆంధ్రప్రభ: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోని గ్రామాల తరలింపుపై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతోందని, గ్రామసభల తీర్మానాలు మరియు ప్రజల అంగీకారంతోనే రీలోకేషన్ చేపడుతున్నామని బుధవారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
భారీ పరిహారం, మెరుగైన వసతులు
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టిసిఏ) మార్గదర్శకాల ప్రకారం ఆప్షన్-2 ఎంచుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఫ్యామిలీ యూనిట్‌కు 5 ఎకరాల వ్యవసాయ భూమి, నివాస గృహాలు, కమ్యూనిటీ వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో బాచారం సమీప అటవీ భూమిలో పునరావాసం చేపడుతున్నట్లు వివరించారు.
5 గ్రామాల తరలింపు ప్రక్రియ కొనసాగింపు
ప్రస్తుతం తాటిగుండాల, కొల్లాంపెంట, వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల తరలింపు కొనసాగుతోందని తెలిపారు. అడవిలో వన్యప్రాణుల వల్ల పంట నష్టం, మార్కెట్‌కు పంట రవాణా, తమ పిల్లల చదువుతో పాటు ఇతరత్రా కష్టాల కారణంగా ప్రజలే స్వచ్ఛందంగా తరలిపోవడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
బలవంతం లేదు – నిబంధనలు కఠినం
ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, అక్కడే ఉండాలనుకునే వారికి ప్రస్తుత వసతులు కొనసాగుతాయని జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర స్పష్టం చేశారు. అయితే కోర్ ఏరియాలో కొత్త శాశ్వత నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో, ఆ ప్రక్రియ సుదీర్ఘమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
