మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్‌డీఎల్ ల్యాబ్ ప్రారంభం..

మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్‌డీఎల్ ల్యాబ్ ప్రారంభం..

రూ.66 లక్షలతో నిర్మాణం…
సూపర్ సిక్స్‌లో ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యం.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందించడం ప్రభుత్వ ధ్యేయమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజీలో అత్యాధునిక సదుపాయాలతో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించిన వీఆర్‌డీఎల్ (VRDL) ల్యాబ్ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ల్యాబ్ నిర్మాణం వేగంగా పూర్తి కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి రాష్ట్రవ్యాప్తంగా మంచి సేవలు అందిస్తూ గుర్తింపు పొందిందని, సిబ్బంది కృషిని అభినందించారు. ఆసుపత్రి అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. సి‌ఎస్‌ఆర్ నిధులతో వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ యంత్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదకర స్థితిలో ఉన్న 21 భవనాల స్లాబ్‌ల బలపరిచే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

మెడికల్ కాలేజీలో 70 సెంట్లలో రూ.50 కోట్ల వ్యయంతో ఆధునిక నాలెడ్జ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వైద్య విద్యార్థులకు ఉన్నత స్థాయి వసతులు కల్పించడం ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. కర్నూలు “సూపర్ సిక్స్”లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జనరల్ ఆసుపత్రి రాష్ట్రంలోనే అత్యధిక ఓపీ సేవలు అందిస్తున్న ప్రముఖ ఆసుపత్రిగా నిలిచిందన్నారు.

రోజూ వేలాది మంది రోగులు ఇక్కడికి రావడం వైద్య సేవల నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ఆరు నెలల్లో వీఆర్‌డీఎల్ ల్యాబ్ నిర్మాణం పూర్తి కావడం అభినందనీయమన్నారు. సి‌ఎస్‌ఆర్ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో వెంటిలేటర్ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. నర్సింగ్ కళాశాల విద్యార్థుల కోసం ఎంపీ నిధులతో ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.

కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడం లక్ష్యమని చెప్పారు. కర్నూలుతో పాటు పరిసర జిల్లాలు, తెలంగాణ నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన క్యాన్సర్ యూనిట్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఏపీఎంఐడీసీ అధికారులకు సూచించారు. మెడికల్ కాలేజీ సమీపంలో ప్రమాదాలకు కారణమైన బ్లాక్ స్పాట్‌ను తొలగించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగామని తెలిపారు.

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ల్యాబ్ భవనం వేగంగా పూర్తి కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ల్యాబ్ ఇన్‌చార్జ్ డాక్టర్ రేణుకా దేవి మాట్లాడుతూ మూడు నెలల్లో పరికరాలను అమర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లక్ష్మి, డాక్టర్ హరి చరణ్, డాక్టర్ ప్రవీణ్, సాయి ప్రదీప్, రీజినల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ యూనిట్ డాక్టర్ ప్రకాష్, ఏపీఎంఐడీసీ ఇంజనీర్లు ఇందిర, చిరంజీవులు, జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply