హైదరాబాద్ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం..

హైదరాబాద్ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం..

400 ఏళ్ల నగరాన్ని తక్కువ చేయడం దురుద్దేశం..
అమరావతి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై ఆరోపణలు…
రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుదారి పట్టించే ప్రయత్నం..
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న…

విజయవాడ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ అభివృద్ధి, చరిత్రపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు సహజసిద్ధంగా లేదా ఒక్క రోజులో అభివృద్ధి చెందలేదని, శతాబ్దాల చరిత్ర, ప్రభుత్వాల కృషితోనే ఈ స్థాయికి చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇలాంటి నగరాన్ని తక్కువ చేసి మాట్లాడడం రాజకీయ దురుద్దేశంతోనేనని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక ముఖ్యమంత్రి వల్లే జరిగిందని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని వెంకన్న అన్నారు. ఒక వ్యక్తి వల్లే నగరం అభివృద్ధి చెందితే, గతంలో పనిచేసిన ప్రభుత్వాల పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి విషయంలో కూడా ఇదే విధంగా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అమరావతి నిర్మాణం ఒక దీర్ఘకాల ప్రాజెక్ట్ అని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు అవసరమని, పెట్టుబడులను ఆకర్షించే విధానాలు అమలు చేయాలని సూచించారు. హైదరాబాద్ వంటి నగరాల అభివృద్ధి మోడల్‌ను అధ్యయనం చేసి, అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కోణంలో అభివృద్ధిని చూడటం సరైంది కాదని, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని వెంకన్న స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply