TG | దోస్త్ నోటిఫికేషన్ విడుదల

TG | దోస్త్ నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
TG | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ – DOST 2026-27 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సోమవారం దోస్త్ 2026-27 షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఉన్నత విద్యామండలి మూడు విడతల్లో ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు మహిళా వర్సిటీ, జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో బి.ఏ, బి.ఎస్సీ, బి.కామ్ వంటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు కొనసాగనుంది. ఫేజ్-1 రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200గా నిర్ణయించారు. ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఆ తర్వాత రెండో విడత రిజిస్ట్రేషన్లు ఫీజు రూ. 400 తో మే 15 నుండి 25 వరకు చేసుకోవాలి. మే 16 నుంచి 26 వరకు అన్ లైన్ వెబ్ ఆప్షన్ లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. రెండో విడత సీట్ల కేటాయింపు మే 30 న నిర్వహిస్తారు.
