అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి, మండలం లోని గూడెం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న పశువులను శనివారం గోసంరక్షణ సమితి సబ్యలు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం సిల్వకోడూరు గ్రామానికి చెందిన ఎండి సజీద్ అనే అతను, అతని యజమాని ఎండి అంజత్ చెప్పినట్లు కౌటాలలో లోడు చేసుకొని కరీంనగర్ జిల్లా గంగాధరకు ఆరు ఆవులను బొలెరో వాహనం టిఎస్ 21 టి 9358లో తరలిస్తున్నట్లుపక్కా సమాచారంతో గో సంరక్షణ సమితి సభ్యులు బొమ్మేన మహేశ్, కొండ నరేశ్, ముత్తె భూమేష్, స్వామిలు వాహనాన్ని అడ్డుకున్నారు.ఆరు ఆవులను కట్టిపడేసి, వెనుకాల పెద్ద డోరు పెట్టడంతో పశువులకు ఊపిరి ఆడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ఆ ఆవులను మంచిర్యాల జిల్లా చెన్నూరు గోశాలకు తరలించారు. వాహనంలో డ్రైవర్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

