747 ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం బట్టబయలు

747 ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం బట్టబయలు
- కురవి మేజర్ గ్రామపంచాయతీ భూమిపై అధికారుల గర్జన
- జీపీఓ గంగరబోయిన కృష్ణ సస్పెన్షన్
- కొత్త కలెక్టర్ స్నేహ శబరీష్ దూకుడు…
- ‘తప్పు చేస్తే వదిలేది లేదు’ స్పష్టం
చిన్న గూడూరు, ఆంధ్రప్రభ ; గ్రామపంచాయతీ పరిధిలోని 747 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం జిల్లాలో సంచలన మలుపు తిరిగింది. ఈ అంశంపై వెలువడిన ఆంధ్రప్రభ వరుస కథనాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న శనిగపురం గ్రామ పరిపాలన అధికారి గంగరబోయిన కృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. తాజాగా శాఖాపరమైన చర్యల కింద సస్పెన్షన్ విధించడం ఈ వ్యవహారంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త కలెక్టర్ చర్యలకు ప్రశంసలు
జిల్లాకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్నేహ శబరీష్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి విచారణను వేగవంతం చేయడంతోనే ఈ చర్యలు చోటుచేసుకున్నాయని సమాచారం. తక్కువ సమయంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిపాలనలో మార్పు కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తప్పు చేస్తే ఎంతటి అధికారులైనా ఉపేక్షించబోమనే సందేశాన్ని ఈ చర్య స్పష్టంగా ఇచ్చిందని పలువురు పేర్కొంటున్నారు.
ప్రజా సమస్యలపై స్పందనకు అభినందనలు
ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రభ కథనాలపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సమస్యలను నిరంతరం ప్రస్తావించడం వల్లే అధికార యంత్రాంగం స్పందించాల్సి వచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మరికొంతమంది బాధితులు ముందుకు
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరు బాధితులు ఉన్నట్లు సమాచారం. వారు కూడా తమ వద్ద ఉన్న పూర్తి ఆధారాలతో ముందుకు వస్తూ, పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు బాధితులు వివరాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఇంకా బయటపడాల్సిన నిజాలు
747 సర్వే నెంబర్‌కు చెందిన ప్రభుత్వ భూమి వ్యవహారం ఇంతటితో ముగిసినట్టుకాదు. ఇంకా పూర్తి స్థాయి విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అక్రమంగా భూములను విక్రయించిన వారితో పాటు సహకరించిన ఇతరులపై కూడా చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది
ఈ విషయంపై చరవాణి ద్వారా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) అదనపు అనిల్‌ను వివరణ కోరగా, ఫోన్‌పే లావాదేవీలను ఆధారంగా తీసుకుని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించిన ప్రభుత్వ ఉద్యోగి జిపిఓ గంగరబోయిన కృష్ణపై సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు. ఈ మేరకు శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు
న్యాయం గెలిచింది…బాధితుడు క్రాంతి

“నాలుగు నెలలు తలుపులు తట్టాను… ఎవరూ వినలేదు. నా దగ్గర ఉన్నది నిజం మాత్రమే… అదే నన్ను నిలబెట్టింది. నన్ను మోసం చేసిన వాళ్లు ఎంత బలంగా ఉన్నా, చివరకు న్యాయం గెలిచింది. నా ఫిర్యాదును పట్టించుకొని చర్యలు తీసుకున్న కలెక్టర్ గారికి, పోలీసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా నా లాంటి బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు నేను ఆగను.” అని బాధితుడు గుగులోత్ క్రాంతి భావోద్వేగంగా స్పందించారు.
