25marchspecialstory | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం

25marchspecialstory | ఆంధ్రప్రభలో నేటి ప్రత్యేక వ్యాసం

25marchspecialstory | తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యం
కరుణానిధి నుంచి ఎమ్జీఆర్ వరకు రాజకీయ మార్పులు
జయలలిత శకం: తిరుగులేని నాయకత్వం
2026 ఎన్నికలు: డీఎంకే vs టీవీకే పోటీ

25marchspecialstory | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాజకీయంగా తమిళనాడు ఒక భిన్నమైన రాష్ట్రం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ హవాయే కొనసాగింది. అయితే కాంగ్రెస్ పార్టీ హవాకు తమిళనాడు చెక్ పెట్టింది. తమిళనాట ద్రవిడ పార్టీల ఆధిపత్యం ప్రారంభమైంది. 1960ల నుంచి తమిళ నాడు రాజకీయాలను రెండే రెండే ద్రవిడ పార్టీలు శాసిస్తున్నాయి. ఇందులో మొదటిది ద్రవిడ మున్నే ట్ర కజగం కాగా రెండోది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం. దీనినే అన్నాడీఎంకే అని కూడా అంటారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలది ఇక్కడ అతిథి పాత్రే. సహజంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు.. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. ద్రవిడ పార్టీల సాయంతో కొన్ని సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీలు సంబరపడుతుంటాయి. ఇదిలా ఉంటే తమిళనాట ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి బ్రేకులు వేయాలని గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. తమిళనాట ద్రవిడ పార్టీలదే హవా అని తమిళ తంబీలు తేల్చి చెప్పారు.

25marchspecialstory
25marchspecialstory

తమిళనాడు రాజకీయాలను చాలాకాలం పాటు కరుణానిధి, ఎన్జీ రామచంద్రన్, జయలలిత శాసించారు. వీరిలో కరుణానిధి, బతికున్నంత కాలం డీఎంకేకు అధినేతగా వ్యవహరించారు. నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి ఆ తరువాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. పరాశక్తి సినిమాలో ఆయన రాసిన డైలాగ్స్, మంటలు పుట్టించాయి. పెరియార్ సిద్ధాంతాలతో ప్రభావితుడైన కరుణానిధి ఆ తరువాతి కాలంలో సినీరంగంలోకి ప్రవేశించారు. సినీ రంగంలో వచ్చిన పాపులారిటీతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాలక్రమంలో కరుణానిధి డీఎంకే అధినేత అయ్యారు. తమిళ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. తమిళనాడుకు మొత్తం ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ద్రవిడ సంస్కృతి చాంపియన్ గా కరుణానిధి పేరు తెచ్చుకున్నారు.

1977లో అధికారంలోకి వచ్చిన ఎమ్జీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయంలో సినీ హీరో ఎమ్జీ రామచంద్రన్ కూడా డీఎంకేలోనే ఉన్నారు. కరుణానిధికి అత్యంత సన్నిహితుడిగా ఎన్జీఆర్ పేరు తెచ్చుకున్నారు. అయితే.. డెబ్బయివ దశకంలో మాటల రచయిత కరుణానిధి, వెండితెర వేలుపు ఎమ్జీ రామచంద్రన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈ విభేదాల ఫలితంగా డీఎంకేలో చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే నుంచి ఎమీ రామచంద్రన్ బయటకు వచ్చారు.

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పేరుతో ఎమీ రామచంద్రన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. కాగా 1977 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. వెండితెర వేలుపు ఎమ్జీ రామచంద్రన్ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. 1977 తరువాత తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రాజకీయ పార్టీల బలాబలాలు మారిపోయాయి. అంతేకాదు అత్యంత జనాదరణగల ముఖ్యమంత్రిగా ఎమ్జీఆర్ పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనతను ఎమ్టీఆర్ స్వంతం చేసుకున్నారు. కాగా 1987లో అనారోగ్యంతో చనిపోయేంతవరకు ఎమ్జీఆరే తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. మొత్తంమీద తమిళనాడు రాజకీయాలపై ఎమ్జీఆర్ చెరగని ముద్ర వేశారు.

అన్నా డీఎంకేలో జయలలిత శకం

ఎమ్జీఆర్ మరణం తరువాత తానే వారసురాలి నంటూ ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ ముందుకొచ్చారు. అయితే ఎమ్జీఆర్ వారసురాలిగా జానకీ రామచంద్రన్ సత్తా చాటుకోలేక పోయారు. ఈ జయలలితకు అన్నా డీఎంకే క్యాడర్ జై కొట్టింది. ఫలితంగా అన్నా డీఎంకేలో జయలలిత శకం ప్రారంభమైంది. ఎమ్జీఆర్ తరువాత అన్నా డీఎంకేలో చక్రం తిప్పిన నాయకురాలు జయలలితే. జయలలితకు మరో పేరు ఉంది. అదే పురచ్చి తలైవి. అంటే విప్లవ నాయకురాలని అర్థం. అనేక అటుపోట్లను ఎదుర్కొని తమిళ రాజకీయాల్లో ఆమె నిలబడ గలిగారు. అప్పటి రాజకీయ ప్రత్యర్థి కరుణానిధి పై జయలలిత అలుపెరుగని పోరాటం చేశారు. రాజకీయ రంగంలో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. సంవత్సరాలు గడిచేకొద్దీ అన్నా డీఎంకేకు జయలలిత తిరుగులేని నాయకురాలు అయ్యారు. తమిళనాట కొన్నేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలు జయలలిత చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు.

ఇదిలా ఉంటే, తమిళనాడులో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. అయితే ఈ ఆనవాయితీకి ఒక ట్రెండుసార్లు మినహా యింపులు లేకపోలేదు. ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ తంబీలు మరోసారి డీఎంకేకు జై కొడతారా లేక వేరే పార్టీకి అధికారం అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సిందే. గతానికి భిన్నంగా, కొత్త పార్టీ టీవీకే నుంచి అధికార డీఎంకేకు గట్టి పోటీ ఎదురవుతోంది.

  • ఎస్.అబ్దుల్ ఖాలిక్
    6300174320

Leave a Reply