తెలుగు తేజం మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలి..

తెలుగు తేజం మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలి..
క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూత..
అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనితో కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేని టెన్నిస్ క్రీడా ప్రపంచంలో మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలని.. క్రీడా ప్రతిభకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సాకేత్ మైనేనికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలె క్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల కోటాలో ఎన్టీఆర్ జిల్లాలో డైరెక్ట్ రిక్రూటీగా డిప్యూటీ కలెక్టర్‌గా ఆయన్ను నియమించింది.
ఈ నేపథ్యంలో సాకేత్ జాయినింగ్ రిపోర్టు సమర్పించిన సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ లక్ష్మీశ.. సాకేత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సాకేత్.. ఏషియన్ గేమ్స్ సహా ప్రఖ్యాత అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించారని.. ఇదేవిధంగా ముందడుగు వేసేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తోందని తెలిపారు.
అంతర్జాతీయ సర్క్యూట్లో విజయాల పరంపరతో ఏటీపీ ర్యాంకింగ్ లో దూసుకెళ్లాలని.. భవిష్యత్తు క్రీడా పోటీల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకొని జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకొస్తారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ద్వారా అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వచ్చే వారంలో ఏటీపీ ఛాలెంజర్ టూర్ కు సంబంధించి ఐరోపా పర్యటనకు వెళ్తున్నట్లు సాకేత్ చెప్పగా కలెక్టర్ లక్ష్మీశ శుభాకాంక్షలు తెలిపారు.
