వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి..

వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి..

బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్పీవో) కొమ్మెర సతీష్ పిలుపునిచ్చారు. బుధవారం బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఐదు రోజుల అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. ప్రజలతో సమన్వయం, పారదర్శకత మరియు బాధ్యతాయుతమైన పరిపాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు.

గ్రామ సభల నిర్వహణ, పారిశుధ్యం మరియు ప్రభుత్వ పథకాల అమలులో వార్డు సభ్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఆర్. మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఓటీల ద్వారా సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టం-2018 ముఖ్యాంశాలు, స్థానిక సంస్థల బాధ్యతలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం మరియు ఆర్థిక నిర్వహణపై సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణను రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి బ్యాచ్ కింద ఈ నెల 4 నుండి 8 వరకు ఆకెనపల్లి, అంకుశం, బట్వాన్‌పల్లి, బుక్కయ్యపల్లి, బుధా కలాన్, బుధా ఖుర్ద్, చాకేపల్లి, చంద్రవెల్లి గ్రామాలకు చెందిన 78 మంది సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు.

రెండో బ్యాచ్ కింద ఈ నెల 9 నుండి 13 వరకు దుగ్నేపల్లి, గురిజాల, కన్నాల, లంబాడితండా, లింగాపూర్, మలగురిజాల, పాత బెల్లంపల్లి, పెర్కపల్లి, సోమగూడెం గ్రామాలకు చెందిన సభ్యులకు శిక్షణ ఉంటుందని వివరించారు. శిక్షణా తరగతులకు వార్డు సభ్యుల హాజరును కచ్చితంగా నమోదు చేస్తామని, ఎవరూ గైర్హాజరు కాకుండా సంబంధిత సర్పంచులు, కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓలు శ్రీపతి, వేదాల శ్రీనివాస్, టీఓటీలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply