ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం
ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవాలకు రావాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దేవాదాయ శాఖ ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై ఈనెల ఆరో తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న కుంభాభిషేక మహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఆహ్వాన పత్రికను దేవదాయ, దేవస్థానం యంత్రాంగం మంగళవారం మధ్యాహ్నం అందజేసింది.
రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వికె శీనానాయక్ ముఖ్యమంత్రివారిని కలిసి ఆహ్వానం అందించారు.ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్, వేద పండితులు, అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీస్సులు అందజేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం సమర్పించి, అమ్మవారి చిత్రపటాన్ని దేవదాయశాఖ కమిషనర్, దేవస్థానం చైర్మన్, కార్యనిర్వాహణాధికారి కలిసి అందజేశారు.
