Tenali | ప్రతిదీ పరిశీలించి…

Tenali | ప్రతిదీ పరిశీలించి…
- నీటి శుద్ధి ప్లాంట్ నుండి నైపుణ్యాభివృద్ధి కేంద్రం వరకు
- కలెక్టర్ విస్తృత పర్యటన
Tenali | తెనాలి, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. తెనాలి మున్సిపల్ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి ప్లాంటును (ఎస్.టి.పి), టిడ్కో ఇళ్లను, డంపింగ్ యార్డ్ ను, బుర్రిపాలెం రోడ్డులో అర్బన్ హౌసింగ్ లేఔట్ ను, ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రంను, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మున్సిపల్ ప్రాంతంలో ఉన్న ఎస్.టి.పి లో 10 ఎం.ఎల్.డి నీటిని శుద్ధి చేయడం జరుగుతోందన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో 17 ఎం.ఎల్.డి మురుగు నీరు శుద్ధి చేయాల్సి ఉందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ పరిశీలించడం జరిగిందని చెప్పారు. టిడ్కో గృహాలను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వాటి నిర్మాణ నాణ్యతను పరిశీలించామని అన్నారు. బుర్రిపాలెంలో అర్బన్ హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించడం జరిగిందని చెప్పారు. 2,880 గృహాలు నిర్మించాల్సింది ఉందని, వాటిని త్వరగా పూర్తి చేయుటకు లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు.

నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అభ్యర్థులతో మాట్లాడుతూ చక్కటి నైపుణ్యం సంపాదించాలని తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామప్పలనాయుడు, ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీర్లు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ వివరాలను తెలిపారు.
గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జె.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ అర్బన్ లేఔట్ లో లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణాలు వివరించారు. అదనపు సహాయంగా అందించిన అంశాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రెవిన్యూ డివిజనల్ అధికారి లక్ష్మి కుమారి తాహసిల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


