AP | సొంత ఇంటి కలను దూరం చేస్తున్న బాబు..

AP | సొంత ఇంటి కలను దూరం చేస్తున్న బాబు..
- 20 మాసాలలో ఒక సెంటు స్ధలం ఇచ్చారా..
- అమరావతిలో ఇచ్చిన ఇంటి పట్టాలు రద్దు చేశారు..
- చంద్రబాబు ప్రభుత్వంను నిలదీయాలి..
- మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ పేదవానికి స్వంత ఇంటి కల సాకారం చేసిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని.. అటువంటి జగన్మోహన్రెడ్డి పై రాజకీయ బురద చల్లటం తగదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంటి పట్టాల పేరుతో రాజకీయ నేరం చేశారంటూ మాట్లాడటం పట్ల మల్లాది విష్ణు మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ధలం లేకపోవటంతో స్ధలం కొనుగోలు చేసి మరీ పేదల స్వంత ఇంటి కల సాకారం చేశారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోనే 30వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చామని అన్నారు.
నగర వ్యాప్తంగా 90వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి పేదల జీవితాలలో నూతన వెలుగులు తీసుకువచ్చామన్నారు. తాము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు, మూడు సెంట్లు స్ధలం ఇస్తామంటూ సూపర్సిక్స్ వాగ్ధానాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 20 నెలలలో కనీసం ఒక్క సెంటు స్ధలం కూడా ఇవ్వలేదని గుర్తుంచుకోవాలని అన్నారు. అమరావతిలో 24 వేల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపకుండా ఇంటి పట్టాలు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నేతలు ఈ వ్యవహారం పై నోరు ఎందుకు మెదపటం లేదని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఇంటి పట్టాలు ఇచ్చిన జగన్మోహన్రెడ్డి పై బురద చల్లటం సరికాదని అన్నారు. బీజేపీ నేతలకు ధైర్యం, దమ్ము ఉంటే రాష్ట్రంలోని పేదలకు ఇంటి స్ధలాలు ఇచ్చేలా చంద్రబాబుతో మాట్లాడాలని హితవు పలికారు. ఏమీ చేయని అధికారంలో ఉన్న చంద్రబాబును వదలివేసి జగన్మోహన్రెడ్డిపై బురద చల్లేందుకు ప్రయత్నించటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు తీరు మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మల్లాది విష్ణు హెచ్చరించారు.
