15 నెలల కాలంలో వారికి ఏం చేశారని వేడుకలు
కోటీశ్వరలను చేస్తామంటూ కోతలు కోస్తూ కాలక్షేపం
లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఎప్పడిస్తారు
ఆడపడుచులకు రూ.2500 ఎక్కడ
పెళ్లి చేసుకుంటున్న జంటలకు తులం బంగారం ఏది
మీ పాలన అంతా అరచేతిలో వైకుంఠం, అబద్ధాలు ప్రచారమే
హైదరాబాద్ – ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వేదనే మిగిలిందన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు.. మహిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాధికారులుగా చెయ్యని చేతగాని సర్కారు మీదని దుయ్యబట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఎప్పడిస్తారు, ఆడపడుచులకు రూ.2500 ఎక్కడ,
పెళ్లి చేసుకుంటున్న జంటలకు తులం బంగారం ఏది అంటూ ప్రశ్నలు కురిపించారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ చేసిన మోసానికిగాను ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో యావత్ కాంగ్రెస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి ఈ ఏడాదిన్నర పాలనలో మహిళలను వంచించారని ధ్వజమెత్తారు. ఏటా 20వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అన్నట్లుంది కాంగ్రెస్ తీరు ఉంది. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన సమాధానం ప్రకారం, సుమారు రూ.5 వేల కోట్ల వడ్డీ లేని రుణాల బకాయి ఉందని, బకాయిలే చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం, ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఎలా ఇస్తుందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల మహిళలు కోటీశ్వరులు కాదు అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో మొట్ట మొదటి హామీగా చెప్పి ఏడాదిన్నరగా అమలు చేయని రేవంత్ సర్కారు ఈరోజు ఇందిరా మహిళా శక్తి పేరిట వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా మహిళల పట్ల గౌరవం, వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే నేడు జరిగే ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఖచ్చితమైన తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అరచేతిలో వైకుంఠం, అబద్ధాలు ప్రచారం:
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు మాత్రం గడప దాటవు అని మరోసారి నిరూపితమైందని గ్యారెంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే రేవంతు సర్కారు మహిళలను దారుణంగా వంచించిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కేసీఆర్ మహిళా సంక్షేమం, సాధికారత, స్వయం సమృద్ధి కోసం ప్రారంభించిన పథకాలకు మంగళం పాడారన్నారు. పెరిగిన క్రైం రేటుతో ఆడబిడ్డలకు భద్రత కరువైందని, నోటిఫికేషన్లు రాక యువతుల ఉద్యోగ కలల సాకారం ప్రశ్నార్థక మైందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయకుండా ఇన్నాళ్లు కాలం వెల్లదీశారు. ఇప్పుడేమో అన్నీ చేసినట్లు, మహిళలను కోటీశ్వరులను చేసినట్లు కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి ఉందన్నారు.