summer| మండుతున్న ఎండలు

summer| మండుతున్న ఎండలు
తెలుగు రాష్ర్టాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
బయటకు రావడానికి భయపడుతున్న జనం
మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా రోడ్లు
పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఏప్రిల్ నెల ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండుతున్నాయి. పలు జిల్లాల్లో 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. సాయంత్రం వరకు ఎండ వేడిమి తగ్గడం లేదు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు ఎండ తీవ్రతకు దాహంతో అల్లాడిపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి గిరాకీ పెరిగింది. కొబ్బరి బోండాలు, పండ్ల జ్యూస్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.

మధ్యాహ్నం బయటకు రాకపోవడమే బెస్ట్..
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని, ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ ధరించాలని చెబుతున్నారు. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్ష ఎండలో తిరగకపోవడం మంచిదని వివరిస్తున్నారు. తేలికపాటి ఆహారం తీసుకోవడం, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు.

ఏసీ, కూలర్లకు డిమాండ్
ఎండవేడిమికి ప్రజలు ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఉక్కబోతతో రాత్రి పగలు ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. దీంతో ఏసీలు, కూలర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సంపన్నులు, మధ్యతరగతి వారు ఏసీలు కొంటుండగా.. పేదలు కూలర్లు కొంటున్నారు. మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్య కూలర్లు దొరుకుతున్నాయి. ఏసీల ధరలు రూ.40వేలకు పైగా పలుకుతున్నాయి. ఫ్రిజ్‌లకు, మట్టికుండలకు కూడా గిరాకీ పెరిగింది.

