విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు.. ఎన్టీఆర్ నటించిన “దాన వీర శూర కర్ణ” చిత్రంలోని సూపర్ హిట్ డైలాగ్‌ను చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అలరించారు.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్‌తో పాటు తదితరులు హాజరయ్యారు. అనంతరం రెండ్రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో విజేతలకు సీఎం బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధుల క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర వహించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈరోజు మరింత ఉత్సాహంగా, మరింత సంతృప్తిగా కనిపిస్తున్నారని చమత్కారంగా మాట్లాడారు.
‘‘ప్రతిపక్షం, అధికార పక్షం అనేది ప్రజాసమస్యలపై పోరాడటానికి తప్ప వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవడానికి కాదు. ఒకప్పుడు సభ్యులంతా ఆప్యాయంగా పలకరించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి. బద్దశత్రువులుగా మారారు. అసెంబ్లీ అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప ప్రతిపక్షాలకు కాదు.
అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వింటుంది. గతేడాది వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగితే వారి బూతులు వినలేక ప్రజలు టీవీలు కట్టేసేవారు. కానీ ఇప్పుడు గర్వంగా చెప్తున్నా… కౌరవ సభ గౌరవ సభగా మారింది. ప్రజలకు కావాల్సింది సమస్యల పరిష్కారం. బూతులు తిడితే తిట్టిన వారికి ఆనందం కలిగిస్తాయి తప్ప, ప్రజలకు కాదు.”అని సీఎం చంద్రబాబు అన్నారు.