Women-reservation-bill | రాజకీయ పార్టీల వాదనలు, వివాదాలు

Women-reservation-bill | రాజకీయ పార్టీల వాదనలు, వివాదాలు

Women-reservation-bill | మహిళా బిల్లు: ఎందుకు నిలిచిపోయింది?
మహిళల హక్కులు మరియు ప్రతినిధిత్వం అవసరం
అమలు లోపాలు, వ్యవస్థలో సమస్యలు
మహిళా చైతన్యం మరియు భవిష్యత్తు దిశ

Women-reservation-bill | దాదాపు మూడు దశాబ్దాల కల కలగానే మిగిలిపోనుందా అనే సందేహం మహిళలకే కాదు, స్త్రీల ఉన్నతికి కృషి చేసే వారందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. 131వ రాజ్యాంగ సవరణ మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా బిల్లు నిలిచిపోవడం కొత్త విషయం కాదు; గతంలో కూడా సుమారు ఆరు, ఏడు సార్లు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎన్డీఏ కూటమి మహిళా బిల్లుకు డిలిమిటేషన్‌ను అనుసంధానం చేయడంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్ష నేతలు వ్యతిరేకిస్తూ ఓటు వేశారని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చినప్పటికీ, ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతులైన 352 మెజారిటీ దక్కలేదు. అంటే 54 ఓట్లు తక్కువయ్యాయి.

మహిళా బిల్లు ఎన్డీఏ కుట్రలో భాగమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్‌తో ముడిపెట్టి బిల్లును ముందుకు తేవడం తప్పిదమని, బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా వ్యవహరిస్తోందని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో విపక్షాలు మద్దతు ఇవ్వలేదని చెబుతున్నారు. మరోవైపు మహిళా బిల్లుకు వ్యతిరేకించిన వారిని దేశ ప్రజలు క్షమించరని, మహిళల ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఎన్డీఏ కూటమి వాదిస్తోంది.

మహిళా బిల్లుపై ఎవరి బాధ్యత ఎంత ఉందనేది భవిష్యత్తులో తేలనుంది. కానీ ఏ వాదనలు ఉన్నా, మహిళలు చట్టసభల్లోకి రావడం వారి హక్కు. కనీసం ఇప్పటికైనా మహిళలపై గౌరవంతో, వీలైనంత త్వరగా మహిళా బిల్లును ఆమోదించేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా పని చేయాలి. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు ఎన్డీఏపై ఒత్తిడి తెచ్చే బాధ్యత విపక్షాలపై కూడా ఉంది. ఎవరి పాత్రను వారు సమర్థవంతంగా నిర్వర్తిస్తారో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తారో, ఆ పార్టీలను మహిళా లోకం గుర్తుంచుకుంటుంది.

దేశంలోని కొన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినా, అధికార వ్యవస్థలో వారికి పూర్తి స్వేచ్ఛ లభించడం లేదు. మహిళా ప్రజా ప్రతినిధులు అనేక సందర్భాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. కాబట్టి సమాన హక్కులతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళలకు నిజమైన న్యాయం జరుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం కూడా నిజాయితీగా మహిళా బిల్లును ఆమోదించేలా కృషి చేసి ఉంటే, మహిళల దృష్టిలో బీజేపీకి మరింత ఆదరణ పెరిగేది. కానీ రాజకీయ లెక్కలు, వ్యూహాల నేపథ్యంలో ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇవ్వడం లేదనే అభిప్రాయాలు మేధావులు, రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. దేశంలో జనాభా, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నప్పుడు, చట్టసభల్లో సగం జనాభా ఉన్న మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఏది ఏమైనప్పటికీ మహిళా బిల్లు తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే శాసన నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం అత్యంత అవసరం. ఈ సృష్టిలో నింగి నుంచి నేల వరకు మహిళలు సేవలు అందిస్తున్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం వారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు కనీసం మూడొంతుల రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ బిల్లు సుదీర్ఘ కాలంగా ఆమోదం పొందకపోవడం బాధాకరం.

చివరగా, మహిళలు చైతన్యం చెందితేనే ఈ బిల్లు ముందుకు సాగుతుంది. మహిళలు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా కుటుంబాన్ని సంరక్షిస్తూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే స్త్రీ అంటే అబల కాదు, సబల. అయినప్పటికీ దేశ రాజకీయాల్లో వారికి ఆశించిన స్థానం దక్కకపోవడం గమనార్హం. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక ఉద్యమాల వరకు మహిళల పాత్ర విశిష్టమని చరిత్ర చెబుతోంది.

మహిళలు ఏకమై, కదం తొక్కుతూ, ఉప్పెనలా ముందుకు వస్తేనే మహిళా బిల్లు ఆమోదానికి దారి పడుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ మహిళల సాధికారత గురించి మాట్లాడుతున్నా, ఆచరణలో మాత్రం మార్పు కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా మహిళల అభ్యున్నతిని ముఖ్యంగా భావించినప్పుడే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8ను అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి మహిళల హక్కుల కోసం కృషి చేస్తోంది. ప్రతి సంవత్సరం మహిళల సాధికారతకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రోత్సహిస్తోంది. అయినప్పటికీ మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నప్పటికీ, వారి హక్కులు పూర్తిగా రక్షితంగా లేవు.

గతంలో బాల్యవివాహాలు, దేవదాసి వ్యవస్థ, సతీ సహగమనం, నిరక్షరాస్యత వంటి అనేక సామాజిక సమస్యలు మహిళలను వెనుకబాటుకు నెట్టాయి. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నప్పటికీ, రాజకీయ ప్రతినిధిత్వం ఇంకా తక్కువగానే ఉంది. మహిళా రిజర్వేషన్ అమలైతే రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మరింత ప్రగతి సాధ్యమవుతుంది.

ఒకప్పుడు మహిళలు వంటగదికే పరిమితమనే భావన ఉండేది. కానీ నేడు దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకం. మహిళ అంటే శక్తి. కాబట్టి మహిళా బిల్లుకు అందరూ మద్దతు తెలపాలి. మహిళల అభ్యున్నతికి కృషి చేసిన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రాజా రామమోహన్ రాయ్‌, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలను గౌరవిస్తూ మహిళా సంక్షేమానికి కట్టుబడాలి.

స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వంటి వీర వనితల త్యాగాలను స్మరించుకోవాలి. సావిత్రీబాయి ఫూలే, రాణి రుద్రమదేవి, ఐల్లమ్మ వంటి మహనీయుల స్ఫూర్తితో మహిళలు సంఘటితమై, మహిళా బిల్లుకు మద్దతుగా గళమెత్తాలి.

  • మిద్దె సురేష్‌
    9701209355

Leave a Reply