70 రోజుల్లోనే 99 రోజుల సమస్యలు తీర్చుతాం

70 రోజుల్లోనే 99 రోజుల సమస్యలు తీర్చుతాం

  • బాలికల ఆరోగ్యానికి పెద్దపీట
  • ప్రజల గొంతు వినడానికే ఇక్కడికి వచ్చాము
  • మున్సిపల్ లో చెత్త ఉంటే ఊరుకోం
  • 88 ఫీట్ల ప్రధాన రహదారి, 60 ఫీట్లు గోదావరి రోడ్ విస్తరణ
  • అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో మంచిర్యాల నియోజకవర్గంలో 99 రోజుల్లో అనుకున్న లక్ష్యాలను 70 రోజుల్లోనే సాధించి చూపుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ వాక్సిన్, 4, 10 వార్డ్ లలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారాల గురించి కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ బాలికలు సర్వేయ్కల్ కాన్సర్ బారిన పడకుండా ప్రభుత్వం ముందు చూపుతో హెచ్ పీ వీ వాక్సిన్ ఉచితంగా అందజేయడం మరువలేనిదన్నారు.

సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. రోగులకు ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4, 10 వార్డ్ లలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. పెన్షన్స్, త్రాగునీరు, పారిశుద్ధ్యం గురించి ప్రజలతో మాట్లాడారు. కొందరు తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, తాగునీరు సక్రమంగా రావడం లేదని ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఈ విషయాల్లో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందని మున్సిపల్ కమీషనర్, తహసీల్దార్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వచ్చే లిస్ట్ లో తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు అందరికీ వస్తాయని తెలిపారు. పెన్షన్ రెన్యువల్ సమస్యలుంటే వెంటనే కలెక్టరేట్ లో సంప్రదిస్తే పరిష్కరిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లక్షేట్టిపేట మంచి ప్రగతిని కనబరస్తుందని ఎమ్మెల్యే కితాబిచ్చారు. ముఖ్యంగా లక్షేట్టిపేట మున్సిపాలిటీలో ఇక నుంచి ఏ ఓపెన్ ప్లాట్ లేదా ఖాళీ స్థలాల్లో చెత్త ఎక్కడ కనిపించకూడదని, ఒకవేళ చెత్త నిల్వలు ఉంటే ఆ స్థలం యాజమాన్యంకు భారీ జరిమానా విధించాలని మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్ ను ఆదేశించారు.

అలాంటి స్థలాలు మున్సిపాలిటీ కంట్రోల్ లో ఉన్నట్లు బోర్డు లను ఏర్పాటు చేయాలన్నారు. పరిశుభ్రత అందరీ బాధ్యత అని గుర్తించాలన్నారు. రోడ్లన్నీ దాదాపుగా ఆక్రమణలకు గురైనట్లు అర్ధమవుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్ స్టాండ్ వరకు ప్రధాన రహదారిని 80 ఫీట్లకు అదే విధంగా గోదావరి రోడ్ ను 60 ఫీట్లకు విస్తరిస్తామని వివరించారు. గతంలో ప్రధాన రహదారి 100 ఫీట్ల విస్తరణ అనుకున్నప్పటికీ కొన్ని సమస్యల వలన 80 ఫీట్లకే కుదిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు తనకు అండగా నిలవాలని, ప్రజల ఆశీర్వాదాలే తనకు నిజమైన బలమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో పెండింగ్ పనుల పరిష్కారం, రేషన్ కార్డ్స్, త్రాగునీరు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, డ్రైనేజ్ ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్, కౌన్సిల్లర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.

ప్రెస్ క్లబ్ భవన్ విస్తరణ, కాంపౌండ్ వాల్ పనుల గురించి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ ప్రశ్నించగా, జూన్ లోపు పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్ లు పాత్రికేయులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజెశ్వరి వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, నాయకులు పూర్ణ చందర్ రావు, నాగభూషణం, కౌన్సిలర్లు బిరుదుల సత్యనారాయణ, చిన్నయ్య, రాజేంద్ర ప్రసాద్, చంద్ర మౌళి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply